సిరిసిల్ల, న్యూస్‌లైన్ : అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి దాహానికి ప్రజల గొంతు తడిపే నీటి పథకం వట్టిపోతోంది. నిర్మా ణ సమయంలో పర్సంటేజీలు దండుకుని మొక్కుబడి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిరిసిల్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాల్సిన రూ.36.50 కోట్ల నీటి పథకం నీరుగారిపోతోంది. 15 రోజుల క్రితం లీకేజీ కాగా, ఇప్పటివరకు అది ఎక్కడ పగిలిపోయిందో తెలియక మున్సిపల్ అధికారులు తల పట్టుకుంటున్నారు. దీంతో పట్టణ ప్రజలకు దిగువ మానేరు నీరు అంద డం లేదు.
కరువు కాలంలో...
ఎండిన ఎగువ మానేరు.. అడుగంటిన భూగర్భజలాలు.. ఎంత తవ్వినా పడని నీరు. మానేరు వాగులో జలసిరి ఇంకిపోయిన రోజులవి. పట్టణ ప్రజల తాగునీటికి ఎప్పుడూ ఇబ్బందులే. ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.36.50 కోట్లను గ్రాంటు రూపంలో మంజూరు చేశారు. 2007లో నీటి పథకాన్ని చేపట్టారు. కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి నలభై కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని సిరిసిల్లకు పంపింగ్ చేసి.. రగుడు శివారులో ఫిల్టర్ చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించడం ఆ పథకం లక్ష్యం.
నిర్మాణంలో జాప్యం.. నాణ్యత లోపం
ఈ పథకం నిర్మాణ బాధ్యతను చేపట్టిన కాంట్రాక్టర్ ఇంజినీర్లకు, ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు ఇచ్చి పనిలో నాణ్యతను ప్రశ్నించకుండా కట్టడి చేశారనే విమర్శలున్నారుు. దీంతో పనిలో జాప్యం జరిగింది. 2009లో నీటి పథకం పూర్తి కావాల్సి ఉండగా.. రెండేళ్లు ఆలస్యంగా 2011లో పూర్తయింది. కరీంనగర్ డ్యామ్ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనిని ముగించారు.
ఏడాదిపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టరే చేపట్టగా.. 2012 మార్చి వరకు కాంట్రాక్టర్ లీకేజీలను మరమ్మతు చేస్తూ మొత్తంగా నీటి సరఫరాను ఏడాదిపాటు కొనసాగించాడు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీదే కావడంతో ఆర్థికంగా భారంగా మారింది. ఒక్కసారి లీకేజీ వస్తే పైపులైన్‌లోని నీటిని తొలగించి మరమ్మతు చేయడానికి రూ.ఇరవై వేల వరకు ఖర్చవుతోంది. ప్రతినెలలో కనీసం రెండుసార్లు లీకేజీ కావడంతో మున్సిపాలిటీకి ఈ నీటి పథకం గుదిబండగా మారింది. కాంట్రాక్టర్ నిర్మాణ సమయంలో పైపులైన్ కింద ఇసుక పోసి లైన్ వేయాల్సి ఉండగా.. పట్టించుకోకుండా పర్సంటేజీలు అందించి బిల్లు పొందాడన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌లోనూ పర్సంటేజీల గొడవ తెరపైకి వచ్చింది. అప్పటి అధికారులు, నాయకుల పట్టింపులేనితనమే ప్రస్తుతం నీటి పథకం దుస్థితికి కారణమనే వాదన ఉంది.
చిక్కని దొరకని లీకేజీలు
పక్షం రోజులుగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకు నీటి సరఫరా నిలిచిపోయింది. 60 హెచ్‌పీ మోటారు ఎల్‌ఎండీ వద్ద నీటిని పంపింగ్ చేస్తుండగా ఆ నీరు సిరిసిల్లకు రావడం లేదు. మూడురోజులపాటు మోటారు రన్‌చేసినా నీరు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది పైపులైన్ వెంట కరీంనగర్‌వరకు పరిశీలించారు. కరీంనగర్ మండలం శ్రీరాములపల్లె వద్ద చెరువులో పైపులైన్ పగిలిపోయినట్లు అనుమానిస్తున్నారు. కమాన్‌పూర్ గేట్‌వాల్వ్‌వరకు నీరు వస్తుండగా, చెరువులో ప్రస్తుతం నీరు ఉండడంతో పైపులైన్ పగిలిందీ.. లేనిది పరిశీలించే అవకాశం లేకుండాపోయింది. పంపింగ్ అవుతున్న నీరు చెరువులోనే పోతున్నాయని భావిస్తున్నారు.
మళ్లీ మా‘నీరే’ దిక్కు..
సిరిసిల్ల ప్రజలకు మానేరు వాగునీటిని ప్రస్తు తం సరఫరా చేస్తున్నారు. ఎల్‌ఎండీ నీటి సరఫరాకు లీకేజీ అడ్డంకిగా మారడంతో ప్రత్యామ్నాయంగా మూడు మోటార్ల ద్వారా మానేరువాగు నీటిని అందిస్తున్నారు. 22 హెచ్‌పీల సామర్థ్యం గల మోటార్లు ఉండడంతో పూర్తిస్థాయిలో వాటర్‌ట్యాంకులు నిండడం లేదు. వాగులోని బావుల్లో పుష్కలంగా నీరు ఉండగా నీటి సరఫరాకు చెడిపోయిన మోటార్లు ఇబ్బందిగా మారా యి. మానేరు ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం నీటి ఇబ్బందులు పెద్దగా లేవు.
60 హెచ్‌పీ మోటార్లు బిగిస్తాం..
సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం నీటి ఇబ్బందులేమీ లేవు. కరీంనగర్ డ్యామ్ నీరు లీకేజీతో రావడం లేదు. వాగులో నుంచి సరఫరా చేస్తున్నాం. చెరువులో నీరు తగ్గగానే లీకేజీ ఆపివేస్తాం. సాయినగర్ పంప్‌హౌస్ వద్ద 60 హెచ్‌పీ మోటారును బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
- బి.సుమన్‌రావు, మున్సిపల్ కమిషనర్
అవి‘నీటి’ పథకం
Published Sat, Aug 17 2013 4:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement