ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు
- ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో చేపట్టే అంతర్గత జలరవాణా పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సకాలంలో పూర్తిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. జాతీయ జలరవాణా సంస్థ చేపట్టే కాల్వల ఆధునీకరణ పనులు వేగంగా జరిగేందుకు ఎంపీలు, అధికారులు సహకరించాలని కోరారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు చేపట్టే జలరవాణా పనులపై కేంద్ర అంతర్గత జలరవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ-పుదుచ్చేరి మధ్య బకింగ్‌హాం కాలువ ద్వారా జలరవాణాను అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయమంత్రి పొన్ను రాధాకృష్ణ మాట్లాడుతూ గడువులోగా ఈ జలమార్గం పనులను పూర్తి చేస్తామన్నారు.
తోటలు తగులబెట్టిన వారిని ఉరితీయాలి: కొత్త రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టడం దారుణమని, అలాంటి వారిని ఉరి తీయాలని కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు.ఆదివారం నగరంలో హడ్కో ప్రాం తీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. విభజన హామీల గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనను రాజీనామా చేయమంటున్నారని మండిపడ్డారు. అలాంటి చిల్లర వ్యక్తుల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.