నన్ను కాదు.. ప్రజలను ఆకర్షిస్తే మంచిది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు : సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
సాలూరు, న్యూస్‌లైన్ : ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా...తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజాపక్షమే ఉంటానని, అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ప్రభుత్వంతోనే పోట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పా రు.
శుక్రవారం ఒక దినపత్రికలో రాజన్నదొర వైఎస్సార్ సీపీని వీడి, టీడీపీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వచ్చిన కథనాన్ని ఆయన విలేకరులసమావేశంలో ఖం డించారు. అధికారం కోసం పార్టీ మారే వ్యక్తిత్వం తనది కాదన్నారు. రెండుసార్లు కాం గ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినా.. తానేమీ దోచుకోలేదు... దాచుకోలేదని తెలిపారు.
తనది అధికార పక్షమో.. ప్రతిపక్షమో కాదని, ఎప్పటికీ ప్రజా పక్షమేనని చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీని ప్రజలు ఓడించారన్నారు. ఆ పార్టీ నాయకులు ఆకర్షించాలనుకుంటే ముం దుగా ప్రజలను ఆకర్షించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలు ఛీకొట్టడంతో పాటు వ్యతిరేకంగా ఉద్యమిస్తారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ,, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. లక్షా 50 వేల కోట్ల రూపాయలని, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ల్లో కొంతమేరకైనా నెరవేర్చాలంటే దాదాపు రూ. 3 లక్షల 60 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.