
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని వేల కిలోమీటర్లు, ఇన్ని నెలల పాటు జరగబోయే పాదయాత్ర ‘ప్రజా సంకల్పం’ కాబోతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తన పాదయాత్రకు అవరోధాలు సృష్టించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు శాడిస్టిక్‌గా సీబీఐ, ఈడీని వాడుకోవడం కూడా చూస్తున్నామన్నారు. గురువారం పార్టీ నేతల విçస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోర్టుకు వెళ్లినప్పుడల్లా చూస్తూ ఉంటాను... అక్కడ చాలా మంది కోర్టుకు హాజరు కానే కారు. హాజరు నుంచి మినహాయింపు పొంది రాకుండా ఉంటారు. కానీ నా విషయంలో ఇంకా ట్రయల్ కూడా మొదలు కాలేదు. ఇంకా డిశ్చార్జి స్థాయిలోనే ఉంది. అయినా కూడా నా ఒక్కడి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
నా విషయం వచ్చేటప్పటికి సీబీఐ లేచి నిలబడుతోంది... ఈడీ లేచి నిలబడుతోంది. కఠినంగా వ్యవహరిస్తోంది... నేనేదో పరుగెత్తి పోతున్నట్లు... దేశమే విడిచి పోతున్నట్లు... వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు.. సీబీఐ, ఈడీల ద్వారా ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నారు. యాత్ర జరగకూడదనే కుయుక్తులు పన్నుతున్నారు. కానీ మన సంకల్పం చాలా గట్టిది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడైతే యాత్ర ఆగుతుందో... అక్కడి నుంచి వచ్చి కోర్టుకు హాజరై ఆ తరువాత మళ్లీ ఆగిన చోట నుంచే మొదలు పెడదాం. సడలని సంకల్పంతో యాత్రను పూర్తి చేస్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారు... పై నుంచి దేవుడు చూస్తున్నాడు..’ అని జగన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై వేసిన కేసులవి....
‘నా మీద కేసులు ఎపుడొచ్చాయి...? దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ నాపై కేసులు లేనే లేవు. ఆయన చనిపోయిన తరువాత నేను సోనియాగాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాతనే కక్ష సాధింపుతో కేసులు వేశారు. కాంగ్రెస్–టీడీపీ రెండూ కలసి కుమ్మక్కై నాపై వేసిన కేసులవి. చంద్రబాబు ఏకంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎలా విప్ జారీ చేసి అవిశ్వాసం నెగ్గకుండా కాపాడారో ప్రజలంతా చూశారు. తెలంగాణలో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికి పోయినా కేసుల్లేకుండా దేశంలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు’ అని జగన్ తెలిపారు.
ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది: మాజీ జడ్జి క్రిష్టప్ప
ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత, జనంలోకి వెళ్లి సమస్యలను తెలుసుకోవాల్సిన వ్యక్తికి కోర్టు హాజరు నుంచి మినహాయింపు రాక పోవడం ప్రజాస్వామ్యంలో తలదించుకోవాల్సిన విషయమని జిల్లా కోర్టు మాజీ జడ్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి మారక్కగారి క్రిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతటి కరుడుగట్టిన నేరస్థుడికైనా, డెకాయిట్‌కైనా సీఆర్పీసీ 205 ప్రకారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందని, అలాంటి ఒక ప్రజాదరణ గల నేతకు అనుమతి లభించక పోవడం పట్ల ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నారు. న్యాయవర్గాల్లో, మేధావి వర్గంలో జగన్‌కు మినహాయింపు లభించని విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరు కాకుండా 205 సీఆర్పీసీ కింద మినహాయింపు పొందిన టీడీపీ నేతల వివరాలను జిల్లాల వారీగా సేకరించాలని సూచించారు. చంద్రబాబునాయుడుపై అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టులో ఒక కేసుందని చెప్పారు. జగన్‌పై అన్యాయంగా కక్ష సాధిస్తున్న తీరును చూసి తట్టుకోలేకే తాను పదవీ విరమణ చేశాక వైఎస్సార్ సీపీలో చేరానని వివరించారు. జగన్‌ను తొక్కాలని చూస్తున్నారని, అయితే ఆయన్ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment