లేని ఆంక్షలు రుద్దొద్దు | we do not accept any restrictions on t.bill, t.jac demand | Sakshi
Sakshi News home page

లేని ఆంక్షలు రుద్దొద్దు

Published Tue, Dec 10 2013 12:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

తెలంగాణ బిల్లు రూపకల్పనకు రాజ్యాంగాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని టీ-జేఏసీ డిమాండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు రూపకల్పనకు రాజ్యాంగాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని టీ-జేఏసీ డిమాండ్ చేసింది. అందులో లేని అంశాలను, ఆంక్షలను బిల్లులో చేర్చి తెలంగాణపై రుద్దవద్దని హెచ్చరించింది. ఇప్పటికే నష్టపోయిన తెలంగాణకే మరింత నష్టం జరిగేలా బిల్లులో ఎన్నో అంశాలున్నాయని.. వాటిని సవరించాల్సిందేనని స్పష్టం చేసింది. బిల్లులోని లోపాలను, వాటి వల్ల జరిగే నష్టాలను అధ్యయనం చేస్తున్నామని, దీనిపై సవివర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపింది. ఎలాంటి లోపాలు లేని సంపూర్ణ తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేదాక పూర్తి అప్రమత్తంగా ఉంటామని తెలిపింది.

 

‘‘తెలంగాణ రాష్ట్ర బిల్లు-మన దృక్పథం’’ అంశంపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం చర్చా కార్యక్రమం జరిగింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, నాగం జనార్ధన్‌రెడ్డి (బీజేపీ), కె.తారక రామారావు (టీఆర్‌ఎస్), కె.యాదవరెడ్డి (కాంగ్రెస్ ఎమ్మెల్సీ), ఆకుల భూమయ్య (తెలంగాణ ప్రజా ఫ్రంట్), టీ-జేఏసీ ముఖ్య నేతలు వి. శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, బి.మధుసూదన్‌రెడ్డి (ఇంటర్ విద్యా జేఏసీ), డి.పి.రెడ్డి (టీడీఎఫ్), బెల్లయ్య నాయక్ (ఎల్‌హెచ్‌పీఎస్), ఎం.చంద్రశేఖర్ గౌడ్ (గ్రూప్-1 అధికారుల సంఘం), రాజ్‌కుమార్ గుప్తా (సచివాలయ ఉద్యోగుల జేఏసీ), కరాటే రవి (ఓయూ జేఏసీ), అరుణ్‌కుమార్ (అడ్వకేట్ జేఏసీ), సీనియర్ జర్నలిస్టులు ఎన్.వేణుగోపాల్, ఆర్.శైలేష్‌రెడ్డి, పి.వి.శ్రీనివాస్, పల్లె రవి, క్రాంతి పాల్గొనగా టీ-జేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
 
 ఉద్యమకారులు వ్యూహాత్మకంగా ఉండాలి: కోదండరాం
 
 ‘‘తెలంగాణ బిల్లు అనే దానికి రాజ్యాంగమే ప్రామాణికంగా ఉండాలి. రాజ్యాంగంలో లేని ఆంక్షలను, అంశాలను బిల్లులో చేర్చి తెలంగాణపై రుద్దొద్దు. ఇందుకోసం అందరం కేంద్రం మీద అదే ఒత్తిడిని కొనసాగిద్దాం. తెలంగాణ ముసాయిదా బిల్లులోని లోపాలను, తెలంగాణకు జరిగే నష్టాలను అధ్యయనం చేస్తున్నాం. ఈ లోపాలపై సవివర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తాం. లోపాలు లేని తెలంగాణ బిల్లును ఆమోదించేదాకా అప్రమత్తంగా ఉందాం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం, బిల్లు అడ్డుకోవడానికి జరిగే కుట్రలను బట్టి ఉద్యమకారులు వ్యూహాత్మకంగా ఉండాలి.’’
 
 ఆంక్షలన్నీ కుట్రలో భాగమే: నాగం జనార్దన్‌రెడ్డి
 
 ‘‘కుట్రలో భాగంగానే తెలంగాణపై ఇంకా ఆంక్షలు పెడుతున్నారు. వాటిని తిప్పికొడదాం. 10 జిల్లాలతో కూడిన, ఎలాంటి ఆంక్షలూ లేని సంపూర్ణ తెలంగాణ ఏర్పాటయ్యే దాకా మేం అండగా ఉంటాం. హైదరాబాద్‌ను పదేళ్లు రాజధానిగా ఉంచాలనడం మాకు సమ్మతం కాదు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని పంపించాలి. అవసరమైతే సీమాంధ్రలోని సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవాలి. తెలంగాణ బిల్లులో లోపాలను సవరించుకునే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఉంది.’’
 
 గవర్నర్ గిరి పేరుతో దాదాగిరి కుదరదు: కేటీఆర్
 
 ‘‘తెలంగాణ బిల్లు ముసాయిదాలో అభ్యంతరకరంగా ఉన్న ఆరు అంశాలపై ప్రధానమంత్రికి లేఖ రాస్తాం. గవర్నర్ గిరి పేరుతో తెలంగాణపై దాదాగిరి చేస్తామంటే ఒప్పుకొనేది లేదు. తెలంగాణలో విద్యావ్యవస్థను దెబ్బతీస్తామంటే అంగీకరించం. జనాభా దామాషా ప్రకారం ఆస్తులు-అప్పులను పంపిణీ చేస్తామంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ ప్రాజెక్టు ఉంటే అప్పులు ఆ ప్రాంతానికే చెందాలి. పెన్షనర్ల భారాన్ని కూడా జనాభా దామాష ప్రకారం పంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతది. రిటైరైన ఉద్యోగి స్థానికత ఆధారంగా పెన్షన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.’’


 1956కు ముందున్న ఆస్తులేవి..?: శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీప్రసాద్, అద్దంకి దయాకర్


 ‘‘తెలంగాణలో 1956కు ముందున్న చాలా ఆస్తులను సమైక్య రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. నష్టం జరిగిన తెలంగాణకే ఇంకా నష్టం చేసే విధంగా బిల్లులో అంశాలున్నాయి. వాటిని సవరించాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. గవర్నర్ పాలనలో ఉద్యోగుల హక్కులను హరించే కుట్ర ఉంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక స్థాయిపై అనుమానాలు కలుగుతున్నాయి. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ఆపుతానంటాడేమో?. తెలంగాణ బిల్లు ముసాయిదాలో కొన్ని స్వాగతించే అంశాలు కూడా ఉన్నాయి.’’


 బిల్లులోని నష్టాలపై పోరాడుతం: కె.యాదవరెడ్డి,
 ఆకుల భూమయ్య
 
 ‘‘తెలంగాణకు నష్టం జరిగే అంశాలేమున్నా వ్యతిరేకిస్తాం. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తాం. ఈ నెల 16న చలో అసెంబ్లీ నిర్వహించుకుందాం. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరిగే అవకాశమున్నందున ఉద్యమకారులు భారీగా తరలిరావాలి. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేయాలి.’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement