
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): మా పిల్లలకు న్యాయం జరిగే వరకూ విజయవాడ నగరం విడిచి వెళ్లేది లేదని ఫాతిమా కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమగోడు చెప్పుకొందామని వస్తే ఆయన ఆపాయింట్‌మెంట్ లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇర్షాద్, ఆర్ అబ్దుల్లా మాట్లాడారు.
మా పిల్లలకు న్యాయం చేస్తామని నంద్యాల ఎన్నికల సభలో చంద్రబాబు హామీ ఇచ్చారని, ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల 2015–16 బ్యాచ్‌కు చెందిన 99 మంది విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రవేశం కల్పిస్తామని చంద్రబాబే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కూడా తమ పిల్లల భవిష్యత్తుపై హామీ ఇచ్చారని.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరించే వరకూ తాము నగరంలోనే ఉంటామని స్పష్టం చేశారు.. అవసరమైతే ధర్నాకు దిగుతామని చెప్పారు.