సాక్షి, ఏలూరు : చిన్నా పెద్దా తేడా లేదు. వారూ వీరనే భేదం లేదు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జనమంతా ఏకయమ్యారు. తెలుగుతల్లి కోసం జిల్లా ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జిల్లాలో మొదలైన నిరసనల హోరు ఆదివారం 12వ రోజుకు చేరింది. సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజును వివిధ సంఘాలు, జేఏసీ, రాజకీయ పార్టీలు జంగారెడ్డిగూడెంలో సన్మానించాయి. లారీ ఓనర్లు, వర్కర్ల అసోసియేషన్ ప్రతినిధులు జంగారెడ్డిగూడెంలో లారీలతో ర్యాలీ జరిపారు. మాజీ మంత్రి మాగంటి బాబు, పోలవరం ఏఎంసీ చైర్మన్, డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు వారికి మద్దతు తెలిపారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళి చింతలపూడిలో తెలిపారు.
ఇక్కడ రిలే దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. పాలకొల్లులో రిలే దీక్షలు 11వ రోజూ కొనసాగాయి. ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య. వైఎస్సార్ సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు మద్దతు తెలిపారు. పోడూరు మండలం గుమ్మలూరులో సమైక్యాంధ్ర కోరుతూ చర్చిలో ప్రార్థనలు నిర్వహించగా, యలమంచిలి మండలం చించినాడలో దీక్షలు కొనసాగాయి. ఏలూరులో ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎం.తంబి పాల్గొన్నారు. వసంతమహల్ సెంటర్‌లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్యర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, న్యాయవాదులు, గాయత్రి పురోహితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 8వ రోజూ కొనసాగాయి.
అన్నివర్గాలూ ఆందోళన పథంలోనే...
ఏలూరు అమలోద్భవి కేథిడ్రల్ చర్చి నిర్మలా యూత్, ఇంజినీరింగ్ కళాశాల, డిగ్రీ, పీజీ విద్యార్థులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ.. ప్ల కార్డులు చేతపట్టుకుని జేవియర్ నగర్‌లోని చర్చి నుంచి ర్యాలీ నిర్వహించారు. తణుకులో కోడిగుడ్లు ప్యాకింగ్ చేసే కార్మికులు భారీగా తరలివచ్చి సమైక్యాంధ్ర వర్థిల్లాలని నినాదాలు చేశారు. తణుకు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య వారికి మద్దతు పలికారు. రాష్ట్రపతి రోడ్‌లో సోనియా గాంధీ దిష్టిబొమ్మను ఊరేగించి నరేంద్ర సెంటర్లో దహనం చేశారు. పట్టణంలోని నూడిల్స్ తయారీ వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. తణుకులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరాయి. అత్తిలి, ఇరగవరం మండలాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉంగుటూరులో నాలుగో రోజున మండల కళాకారులు రిలే నిరాహార దీక్షలు చేశారు.
వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసు, మాజీ ఎమ్మేల్యే కొండ్రెడ్డి విశ్వనాథం కళాకారులకు పూలమాలు వేసి దీక్షలు ప్రారంభించారు. జిల్లా రంగస్థల వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, ఆప్కో డెరైక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆచంటలో న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు. పెనుగొండ కళాశాల సెంటరులో రిలే దీక్షల్లో విద్యార్థులు భాగస్వాములయ్యారు. మార్టేరు సెంటరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. భీమవరంలో ఆదిత్య స్యూల్ ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. ఉపాధ్యాయులు, సమైక్యాంధ్రప్రదేశ్ జేఏసీ నాయకులు రోడ్డుపై కబడ్డీ ఆడారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడిన ఫిలిప్ అనే యువకుడు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని జేఏసీ నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్‌లో రిలే దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు సందర్శించి సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
సమైక్యాంధ్ర కోరుతూ క్రైస్తవులు శాంతి ర్యాలీ జరిపారు. ఆర్టీసీ కార్మికులు మొహాలకు నల్లగుడ్డలు కట్టుకుని ప్రదర్శన జరిపారు. నిడదవోలులో దాదాపు 10 చర్చి సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవులు ర్యాలీ, మానహారం నిర్వహించారు. నేతల మనసుల్ని మార్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సామూహిక ప్రార్థనలు జరిపారు. తాడేపల్లిగూడెం, కొవ్వూరు పట్టణాల్లో భజన సంఘాల ఆధ్వర్యంలో రోడ్లపై కోలాటాలు ఆడి విభజన నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం
Published Mon, Aug 12 2013 1:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement