రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బాధ్యత గల పౌరురాలిగా రాష్ట్రపతిని కలిశానని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బాధ్యత గల పౌరురాలిగా రాష్ట్రపతిని కలిశానని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులందరూ కలిసి గవర్నర్ నర్సింహన్‌ను కలిశాం. ఆ సమయంలో టీడీపీ నేత అచ్చంనాయుడి సతీమణీ వచ్చారు. అప్పుడు మాట్లాడని చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడెందుకు రాద్దాంతం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.
‘గవర్నర్‌కు ఇచ్చినట్లే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని మూడు పార్టీల నేతల సతీమణులం ఆ రోజే చర్చించుకున్నాం. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాగానే అందరికీ సమాచారమిచ్చారు. గవర్నర్ దగ్గరికి వచ్చిన అచ్చంనాయుడి భార్య మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతం మళ్లీ రుజువైంది’ అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు... రాష్ట్ర సమైక్యత కోసం తాము పోరాడుతుంటే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.