పన్నులు వేయక తప్పదు: మంత్రి నారాయణ
విజయనగరం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే పన్నులు వేయక తప్పదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 70 మున్సిపాలిటీలు అప్పుల్లో ఉన్నాయని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ రూ. 350 కోట్లు, నెల్లూరు కార్పొరేషన్ రూ. 50 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకొక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జూన్‌లో టెండర్లు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తామని, విద్యుత్‌ను పొదుపు చేసేందుకు 5,50,000 ఎల్‌ఈడీ బల్బ్‌లు ఇస్తామని చెప్పారు. మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల ఎన్నికలు నిలిచాయని, కేసులు వేసిన వారిని వెనక్కి తీసుకోవాలని కోరామన్నారు.