‘చంద్రబాబు కుళ్లు, కుమ్మక్కు రాజకీయాలను చూసి ఓర్చుకోలేక ఆ పార్టీ నుంచి బయటకొచ్చా. ఇప్పుడు నాపై ఆయన మైండ్‌గేమ్ ఆడుతున్నారు.
పలమనేరు, న్యూస్‌లైన్:
‘చంద్రబాబు కుళ్లు, కుమ్మక్కు రాజకీయాలను చూసి ఓర్చుకోలేక ఆ పార్టీ నుంచి బయటకొచ్చా. ఇప్పుడు నాపై ఆయన మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు’ అని పలమనేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి విమర్శించారు. మంగళవారం పలమనేరు నియోజకవర్గ కార్యకర్తల విసృ్తత స్థాయి సమావేశం పట్టణ సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో జరిగింది. జిల్లాలోని ముఖ్యనేతలు చెవిరెడ్డిభాస్కర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి హాజరయ్యారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో దివంగత నేత ఎన్టీఆర్ వద్ద క్రమశిక్షణ నేర్చుకున్నా. బాబు కుతంత్రాలను చూసి అసహ్యంతో ఆ పార్టీని వీడి బయటకొచ్చా’నన్నారు. ఆయన్ను వ్యతిరేకించిన తనపై మానసికంగా దెబ్బతీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ఎలా తిప్పికొట్టాలో తెలుసని అన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేసేందుకే తెలుగుతమ్ముళ్లు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అప్పుడు జనా న్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఆల్‌ఫ్రీ వాగ్ధానాలు చేస్తే నమ్మేవారెవరని ప్రశ్నిం చారు. ఎల్లోమీడియా ద్వారా గ్రాఫ్‌లు కిందికి పడిపోయాయంటూ ప్రజలను గందరగోళానికి గురి చేసేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనపై ఎన్ని కుయుక్తులు పన్నినా కార్యకర్తల అండదండలతో ముందుకెళ్తానన్నారు.
కుంభకోణాలు పుట్టింది బాబు హయాంలోనే
‘అన్నాహజారేను చూసి అన్ననవుతా, కేజ్రీవాల్‌ను చూసి అవినీతిపై పోరాడుతా, మదర్ థెరిసాలా ఆదుకుంటా’ నని బాబు చెప్పేమాటలను నమ్మేవాళ్లెవరైనా ఉన్నారా..? అని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు కుంభకోణాలు పుట్టిందే బాబు హయాంలో అని, స్టాంపు కుంభకోణం నుంచి, ప్రశ్నపత్రాల లీక్ దాకా ఎన్నో వెలుగుచూశాయని తెలిపారు.
అమర్‌ను గెలిపించి జగన్‌ను సీఎం చేయండి
మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిగడపకూ సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. అనంతరం నియోజకవర్గ నాయకులు హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, కేశవులు, అబ్బు, కృష్ణమూర్తి, రత్నారెడ్డి సుబ్బారెడ్డి, ఖాదర్‌బాషా, ఇక్బాల్, రవీంద్ర, ప్రమీల, అరుణ్, వాసు, సుధా, గౌస్, బాలాజీనాయుడు, సురేష్, నాగశంకర్‌రెడ్డి, మోహన్ రెడ్డి ప్రసంగించారు.