
వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి
నెల్లూరు (సెంట్రల్): వారంలో ఒకరోజు అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరిస్తే చేనేత కార్మికులకు మంచి జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన చేనేత మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారాలు లేకపోవడంతో చేనేత కార్మికులు దీనావస్థలో ఉన్నారన్నారు. చేనేత వస్త్రాలను తయారు చేసి అగ్గిపెట్టెలో అమర్చి దేశ ఘనతను నలుదిశలా చేనేత కార్మికులు వ్యాపింపజేశారన్నారు. అలాంటి చేనేతలను ఆదుకుని భారతదేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే నిధులను ఎక్కువగా చేనేతలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని కోటంరెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేనేత కార్మికులకు ఏవేవో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం దారుణం అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోని అధికార పార్టీని అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. చేనేతల పోరాటాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కోటంరెడ్డి అన్నారు. నిరుపేదలకు, సామాన్యులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం కష్టమైందని విమర్శించారు. పెద్దపెద్ద వాళ్లకు లోన్లు ఇస్తూ పేద వాళ్లను మరచిపోవడం సిగ్గుచేటన్నారు.
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తొలుత చేనేత కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి, చేనేత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.దశరథరామయ్య, జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.రామరాజు, చేనేత సంఘం జిల్లా నాయకుడు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.