
అపూర్వ స్వాగతం
తిరుపతిలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసి జిల్లా వ్యాప్తంగా అభిమాన సంద్రం కదలివచ్చింది. తమ ప్రియతమ నేతకు అడుగడుగునా ఘనస్వాగతం పలికింది. జైజగన్ అంటూ యువత నినదించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తిరుపతికి విచ్చేసిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి లభించిన అపూర్వ జన స్పందన ఇది.
తిరుపతి తుడా : తిరుపతిలో జరిగిన ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్‌లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్ ఘనస్వాగతం పలికారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నట్లు తెలుసుకున్న నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి.. ఘనస్వాగతం పలికారు. జగన్నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. విమానాశ్రయం నుంచి నాయుడుపేట-బెంగళూరు రహదారి మీదుగా దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్దకు చేరుకున్న జననేతకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి.. బంతిపూల వర్షం కురిపించారు. బాణ సంచా పేల్చి.. కర్పూర హారతులు ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు భారీగా తరలివచ్చి జగన్‌తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దామినేడు, తిరుచానూరు కూడలి, వేదాంతపురం కూడలి ప్రాంతాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిర్ బైపాస్‌రోడ్డు మీదుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద నుంచి పద్మావతి అతిథిగృహం వరకూ భారీ స్కూటర్ ర్యాలీ చేపట్టారు. అప్పటికే పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, నేతలు, కార్యకర్తలను వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
ఆ తర్వాత పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో చెన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. వధూవరులు అభినయ, మదన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారు. రిసెప్షన్‌కు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీహర్ష, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు గాయత్రీదేవి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు దామినేడు కేశవులు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీరేంద్రవర్మ, మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలీ ఖాద్రి, రైతు విభాగం అధ్యక్షులు ఆదికేశవులురెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు హనుమంతునాయక్, బీసీ సెల్ అధ్యక్షులు మిద్దెల హరి, యువజన విభాగం నేతలు ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులు, సదానందరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు హేమంత్‌యాదవ్, నేతలు గుణశేఖర్‌నాయుడు, ఎల్బీ.ప్రభాకర్‌నాయుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, దామినేటి కేశవులు, శ్రీరాములు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పి.రాజేంద్ర, పెంచలయ్య, చిన్ని యాదవ్ పాల్గొన్నారు.