నవ మాసాలు మోసింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇంతలోనే భర్త ఆమెను వదిలేశాడు.
ఓ కన్నతల్లి ఘాతుకం
చీపురుపల్లి: నవ మాసాలు మోసింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇంతలోనే భర్త ఆమెను వదిలేశాడు. ‘అసలే ఆడపిల్ల. ఆపైన అనారోగ్యంతో ఎదుగుబొదుగు లేని శరీరం. అత్తారింటి ఆదరణ లేదు.. కన్నవారికీ భారంగా మారాను..’ అనుకుందో, మరేమనుకుందో కానీ ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయకాలనీకి చెందిన టేకు ఇందు అనే మహిళ తన ఏడాదిన్నర పాప జ్యోత్స్నను మంగళవారం రాత్రి బావిలో పడేసింది.
వెంటనే పాపను బావిలో పడేశానంటూ కేకలు పెట్టింది. దీంతో అక్కడికి చేరుకున్న ఇందు తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేయనున్నట్టు పట్టణ ఎస్‌ఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. అర్ధరాత్రి వరకు పాపను బయటకు వెలికి తీయలేదు. తాను పుట్టింటికి, పాప తనకు భారంగా మారిన పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందని ఇందు చెప్పింది.