‘కోడి’ముందు... గర్జన తరువాత
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): కోడి పందేల కోసం ప్రజాగర్జన వాయిదా వేయాలని టీడీపీ జిల్లా స్థాయి సమావేశంలో పలువురు నాయకులు కోరడం విశేషం. పండుగ రోజుల్లో కోడిపందేలు జరుగుతాయని, ఆ సమయంలో చంద్రుబాబు పర్యటన వాయిదా వేయండని వారు కోరారు. టీడీపీ జిల్లా స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి అధ్యక్షతన బుధవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించారు.
టీడీపీని గెలిపిస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు కోడి పందేలు చట్టబద్ధంగా నిర్వహించుకునేలా అనుమతులు తెస్తానని దెందులూరు ఎమ్మెల్యే గతంలో హామీ ఇవ్వడం వల్ల గెలిచారని, అతని విజయంలో కోడి పందేల పాత్ర ఉందని ఇటీవల ఓ సందర్భంలో చంద్రబాబుతో ఇష్టాగోష్టిలో చెప్పినట్టు జిల్లా పార్టీ పరిశీలకులు గరికిపాటి రామ్మోహన్ చెప్పారు. బాబు ప్రజాగర్జన కంటే కోడిపందేలు ముఖ్యమన్నట్టు నాయకులు మాట్లాడటం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఆదివారం ప్రజాగర్జన సభ పెడితే కష్టమని భీమవరం మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ మెరగాని నారాయణమ్మ చెప్పడం మరో విశేషం
పార్టీకి ఇవే చివరి ఎన్నికలు
‘పార్టీకి ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్నికలని, ప్రజల మనోభావాలకు, కార్యకర్తల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వలస పక్షులకు అవకాశం కల్పిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు హెచ్చరించారు. సమావేశంలో మాగంటి బాబు ఓ పిట్టకథ చెప్పారు.
‘మాకు కొల్లేరు ఉంది. అక్కడ బాగా మేత దొరుకుతుంది. ఆ మేతకోసం ఎక్కడెక్కడి నుంచో పక్షులు వస్తాయి. అక్కడున్న మేత లభ్యమైనంత వరకే ఉంటాయి. తిరిగి బాగా మేత దొరికే వేరే చోటకు వెళుతుంటాయి. అదే మాదిరిగా ఇతర పార్టీల నుంచి టీడీపీలోకిరావటానికి చాలా వలస పక్షులు ఎదురుచూస్తున్నాయి, వాటిని అడ్డుకోవాలి’ అని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారు ఎవరూ ప్రస్తుతం పార్టీలో లేరని, అందరూ కొల్లేరు పక్షులేనని గుంటూరు జిల్లా డీసీసీవీ అధ్యక్షులు సాంబశివరావు కౌంటర్ వేయడం కొసమెరుపు.