'నీరు-చెట్టు'లో అవినీతి అంతు తేలుస్తా | west godavari zp General Meeting | Sakshi
Sakshi News home page

'నీరు-చెట్టు'లో అవినీతి అంతు తేలుస్తా

Mar 21 2016 2:43 PM | Updated on Sep 22 2018 8:22 PM

నీరు-చెట్టు పథకంలో చోటుచేసుకున్న అవినీతి అంతు తేలుస్తానని పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ ముళ్లపూడిబాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు
 సర్వసభ్య సమావేశం బడ్జెట్ ఆమోదం
 సాగునీరు, పారిశుధ్యానికి నిధుల పెంపు
 మహిళా శిశు సంక్షేమ శాఖ నిధుల కోత
 సాధారణ విద్యకూ నిధుల తగ్గింపే
 గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు శూన్యం


ఏలూరు : నీరు-చెట్టు పథకంలో చోటుచేసుకున్న అవినీతి అంతు తేలుస్తానని పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ ముళ్లపూడిబాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ..    నల్లజర్ల మండలంలో చెరువుల తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టరు, మధ్యవర్తిత్వం చేసిన ఒక వ్యక్తి కలిసి రూ.9లక్షలకు పూర్తి చేయాల్సిన పనిని రూ.40లక్షలకు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించి ప్రభుత్వ ధనాన్ని అడ్డంగా బొక్కేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై ఇరిగేషన్ ఎస్‌ఈని, ఈఈని వివరణ కోరారు. వారి వివరణతో శాంతించని చైర్మన్ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు సూచించారు. కలెక్టర్ స్పందించి చెరువుల నిర్మాణం చేపట్టిన గ్రామాల్లో బహిరంగ విచారణకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మంగళవారం ఈ మేరకు విచారణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అంతకుముందు బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది.  ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం మూడున్నరగంటల వరకూ సాగింది.  బడ్జెట్‌లో సాగునీరు, పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. గత బడ్జెట్‌లో రూ.99లక్షల నిధులు కేటాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక కోటీ 60లక్షలు కేటాయించారు. గత బడ్జెట్‌లో సాధారణ విద్యకు రూ.88లక్షల 54వేలు కేటాయించగా,  ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.28లక్షల 70వేలు మాత్రమే కేటాయించారు.  మహిళా శిశు సంక్షేమశాఖకు గత బడ్జెట్‌లో రూ.కోటి 60లక్షలు కేటాయించగా, దానిని ఈ సారి రూ.కోటి 13లక్షలకు కుదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి గత బడ్జెట్‌లో రూ. రూ.కోటి 48లక్షల 39వేలు కేటాయించగా, ప్రస్తుతం రూ.కోటి 59లక్షలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి గత బడ్జెట్‌లో రూ.150కోట్లు కేటాయించగా, ఈ సారి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.  మొత్తానికి గత బడ్జెట్‌ను రూ.603కోట్ల 44లక్షల 41వేల 200లతో రూపొందించి దాన్ని రూ. 396కోట్ల 4లక్షల 75వేల 900కు సవరించారు. ప్రస్తుతం గత సంవత్సరం సవరించిన అంచనాల ఆధారంగా కాస్త ఎక్కువగా రూ.360కోట్ల 18లక్షల 59వేల 400ల నిధులతో  బడ్జెట్‌ను రూపొందించారు.  


 నామమాత్రపు ఫీజుతో పరీక్షలు
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పలు రకాల పరీక్షలను రూ.110 నామమాత్రపు ఫీజుతో చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఆస్పత్రుల్లో వారంలో రోజుకొక రంగు చొప్పున ఏడు బెడ్‌షీట్లు వాడేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని  ప్రభాకర్, జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


 రూ.133 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
అనంతరం జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ.. జిల్లాలో రూ. 133 కోట్లతో 700 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తిచేసి  రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో అన్నిశాఖల అధికారులు పనిచేయాలని సూచించారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. పనికి ఆహార పథకం ద్వారా ఇంతవరకూ కోటిపనిదినాలు కల్పించి రూ.180 కోట్లు విలువ గల పనులు పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలకు ఇంతవరకూ సబ్సిడీలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జలసిరికి పథకానికి వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇవ్వాలని కోరారు.  తణుకు నియోజకవర్గంలో రూ. 5 కోట్లతో అనుమతులు లేకుండా మీట్ అండ్ వెజిటబుల్ ప్రొసెసింగ్ యూనిట్  పేరుతో కబేళాలు నిర్మించి దాని ద్వారా మాంసాన్ని ఇతర దేశాలకు విక్రయం చేస్తున్నారని, దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, వాటిని వెంటనే ఆపాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సమావేశంలో పలు శాఖల పనితీరుపై అధికారులతో చైర్మన్  ముళ్ళపూడి బాపిరాజు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ సమీక్షించారు. అనంతరం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement