రాజంపేట, న్యూస్‌లైన్ : ఆ చిన్నారికి ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ బలవన్మరణానికి పాల్పడింది. తను ఉండే గది కిటికీకి ఓణీతో ఉరేసుకుని తనువు చాలించింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. శనివారం తెలవారుజామున జరిగిన ఈ సంఘటనతో రాజంపేట మండలం నరనరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లెకు చెందిన హేమలత, రామకృష్ణారెడ్డి(ఈయన మైదుకూరులో ట్రాన్స్‌కో శాఖ లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు) దంపతుల కుమార్తె అయిన జి.శ్రీనిధి అలియాస్ సన్ని(13)జవహర్ నవోదయ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
గుర్తించింది ఇలా...
శుక్రవారమంతా తోటి స్నేహితులతో సరాదాగా గడిపిన శ్రీనిధి రాత్రి అందరితో పాటు నిద్రపోయింది. అయితే శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు విద్యార్థినులందరూ పీఈటీ క్లాస్‌కు వెళ్లడం దినచర్య. యథాప్రకారం విద్యార్థినులందరూ క్లాస్‌కు వెళ్లగా వారిలో ఒకరు తక్కువగా ఉన్నారు. శ్రీనిధి రాలేదని తెలుసుకుని ఆ అమ్మాయి కోసం తోటి విద్యార్థులను పిల్చుకురమ్మని పంపారు.
అయితే ఆమె కన్పించలేదు. అదే విషయం ఉపాధ్యాయులకు తెలుపగా, వారొచ్చి గదంతా పరిశీలించారు. స్టోర్ రూపంలో గోడకు ఓ వైపున ఆనుకుని నిద్రపోతున్నట్లుగా కన్పించింది. నిద్రపోతోందేమోనని భావించి ఆమెను లేపేందుకు ప్రయత్నించే క్రమంలో ఓణీతో కిటికీకి ఉరేసుకుని ఉండడాన్ని గుర్తించి హడలెత్తిపోయారు. వెంటనే ఆమెను కదిపి చూడగా ఎటువంటి కదలికలు లేవు. అప్పటికే మరణించినట్లు గుర్తించి వెంటనే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కేవీఎస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
పండుగకు వచ్చిందే చివరిసారి..
పండుగకు స్వగ్రామానికి వచ్చిన శ్రీనిధి కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపింది. పండుగ తరువాత తండ్రితో కలసి పాఠశాలకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. అంతలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై నవోదయ ప్రిన్సిపాల్ పోలసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సుధాకర్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు శ్రీనిధి రాసి ఉంచిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
కదిలొచ్చిన యంత్రాంగం
నవోదయ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, డీఈఓ అంజయ్య, స్థానిక తహశీల్దార్ చండ్రాయుడు వెంటనే విద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు.
ఆ బిడ్డకు ఏం కష్టమొచ్చిందో..
Published Sun, Jan 26 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement