రెండు దశాబ్దాల కిందట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన చట్టమే కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికీ వెంటాడుతోంది.
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల కిందట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన చట్టమే కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ చట్టాన్ని సవరించిన తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించడంతో వేలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. వెంటనే ఆర్థిక శాఖ సన్నాహాలు ప్రారంభించింది.
వివిధ ప్రభుత్వ విభాగాల్లోని దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని అంచనా వేసింది. ఇందుకు విధివిధానాలను కూడా ప్రభుత్వం ఇటీవలే సిద్ధం చేసింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను నిషేధిస్తూ 1994లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని చేసింది. దీంతో ప్రస్తుతం ఇది అడ్డంకిగా మారింది. ఆ చట్టానికి సవరణ చేసేంత వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.
చట్ట సవరణకు రాష్ట్ర కేబినేట్ ఆమో దం తప్పనిసరి. సీఎం ప్రకటన నేపథ్యంలో తదుపరి కేబినేట్ సమావేశంలో దీన్ని ఎజెం డాగా పొందుపరిచే అవకాశముంది. ఆ తర్వాతే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడుతాయి. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ తగిన మార్గదర్శకాలను సిఫారసు చేసింది. వీటి ప్రకారం గత ఏడాది జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో మిగతా వారిని ఐదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే పరిగణించి తర్వాతే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు.
ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఇది వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. ప్రస్తుతం పని చేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయస్సు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు. నియామక పద్ధతిని అనుసరించి ఉద్యోగంలో చేరిన వారికే రెగ్యులరైజేషన్ చెల్లుబాటవుతుంది. అడ్డదారిలో నియమితులైన వారిని అనర్హులుగా పక్కనబెడతారు. రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది.