ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఆర్ భవన్‌లో నగర కార్యదర్శి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధి పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక దారి తప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టెట్‌ను రద్దు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎడ్ విద్యార్థులకు ఎస్జీటీలో అవకాశం కల్పిస్తూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించి 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శ్రీరాంనగర్, బుధవారపేట, దేవనగర్, భూపాల్‌నగర్‌కు చెందిన 50 మంది యువకులు ఏఐవైఎఫ్‌లో చేరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నగర నాయకులు శివ, అశోక్, దేవనకొండ ఎంపీటీసీ నరసన్న తదితరులు పాల్గొన్నారు.