
మా ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నిరాశ కలిగించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోదని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంటుందని అంగీకరించారు. మినిస్టర్స్ క్వార్టర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధిష్టానం మాట వినకపోయినప్పటికీ తమ ప్రాంత ప్రజల మనోభావాలను హైకమాండ్కు తెలియజేశామన్నారు. సమస్య వచ్చిందని పారిపోబోమని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు ఎక్కడా అనలేదని బొత్స తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని టీడీపీ, వైఎస్సార్ సీపీ కోరాయని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ సమైక్యాంధ్రకే మద్దతు పలికారని అన్నారు. తమ ప్రాంత ప్రజల ఆవేదనను కేంద్రానికి తెలిపామన్నారు. హైదరాబాద్లో ఉంటున్న సీమాంధ్రల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. పదవులు పట్టుకుని వేలాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు.