
సభకు అభ్యంతరమెందుకు?: వీరశివారెడ్డి
తెలంగాణవాదుల ప్రవర్తన చూస్తుంటే మునుముందు పరస్థితులపై భయాందోళనలు కలుగుతున్నాయని వైఎస్‌ఆర్ జిల్లా కమాలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. సభ సజావుగా జరగనీయకుండా చేసేందుకు బంద్ పాటించడాన్ని ఖండించారు.
తెంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం సూత్రపాయంగా అంగీకరించిందని, ఇలాంటప్పుడు సభ జరిగితే వారికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాయితే రాష్ట్ర విభజన జరిగాక పరిస్థితి ఇంక ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సాగు, తాగు నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విభజన ప్రక్రియకు ముందే చర్చ జరగాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రకటించడం ద్వారా కడుపు నిండి ఉన్న ఈ ప్రాంతం వారు సంయమనం పాటించాల్సి ఉంటుందని హితువు పలికారు. టీఎన్జ్‌వోలు భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవద్దని సూచించారు.