
ఇడుపులపాయ ప్లీనరీలో ప్రసంగిస్తున్న షర్మిల
ఇడుపులపాయ: సబ్బం హరి గారు సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజా ప్రస్థానం పేరుతో జరుగుతున్న పార్టీ రెండవ ప్లీనరీలో ఆమె ప్రసంగించారు. హరితోపాటు మరో ప్రబుద్దుడు కనుమూరు రఘురామ కృష్ణం రాజు సమైక్యాంధ్ర కోసం జగనన్న చిత్తశుద్దితో పోరాటం చేయడంలేదని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సమైక్య రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో చెబుతారన్నారు. జగనన్న పోరాడుతున్నారో లేక కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారో చెబుతారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం విజయమ్మ, జగనన్న, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 175 మంది కోఆర్డినేటర్లు నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిగ్గులేకుండా రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటున్న బిజెపిలో ఎందుకు చేరారు? అని రఘురామ కృష్ణం రాజును ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నంది సోనియా గాంధీ - సహకరిస్తున్నది కిరణ్ కుమార్ రెడ్డి - దానికి సహకరిస్తూ లేఖ రాసింది చంద్రబాబు నాయుడు.. ఈ విషయాలు రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమపై లేనిపోని తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. చిన్నాన్న సుబ్బారెడ్డిని, తనను జగనన్న తొక్కేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తన తరపున కూడా సమాదానం చెప్పమని చిన్నాన్న చెప్పారన్నారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి ఆమె పక్కనే నిలబడ్డారు. తనని, చిన్నాన్నను ఎంపిగా పోటీ చేయమని ఎప్పుడో అడిగారని చెప్పారు. తన అభిప్రాయాన్ని టివి ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు.