నన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు
♦ ‘జన్మభూమి-మాఊరు’ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
♦ అధికారుల్ని వేదికపైకి పిలిచి హెచ్చరికలు
సాక్షిప్రతినిధి, అనంతపురం/తిరుపతి: తనను విమర్శించే నైతికహక్కు ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను నిప్పులా బతికానని, 30 ఏళ్లు ఎవరూ వేలెత్తి చూపని విధంగా బతికిన పరిస్థితి తనదని పేర్కొన్నారు.
‘తెలంగాణలో టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ నేతలు కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ కూడా టీఆర్‌ఎస్‌కు ఓటేసింది. ఎమ్మెల్యేలుగా పార్టీ గుర్తుపై గెలిచిన వారికి రహస్య ఓటింగ్ ఎందుకు? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ మెజార్టీ మేరకు దామాషా పద్ధతిన ఎమ్మెల్సీలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం గ్రామాల్లో బుధవారం జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.
‘కాంగ్రెస్ కుట్రపూరిత, అవినీతి రాజకీయాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ.. టీడీపీని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాయి. వీటితో టీఆర్‌ఎస్ కూడా లాలూచీ పడింది. దీనివల్లే మనకు కష్టాలొచ్చాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన వైఎస్సార్‌సీపీ.. ఆ పార్టీని సమర్థిస్తూ నన్ను విమర్శిస్తోంది. నన్ను విమర్శించే నైతికహక్కు ఎవ్వరికీ లేదు. వైఎస్సార్‌సీపీ నేతలు దీక్ష పెడుతున్నారు.
22 వేల నుంచి 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశాం. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి రుణంగా 10వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఎన్నికల కోడ్ అడ్డుగా లేకపోతే ఈ రోజే చెక్కులు పంపిణీ చేసేవాళ్లం. ఇలాంటి పనులు యజ్ఞంలా చేస్తుంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు 24 గంటలూ రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు’ అని అన్నారు.
యథేచ్ఛగా ఎన్నిల కోడ్ ఉల్లంఘన
జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్‌కు రాష్ట్రప్రభుత్వం తూట్లు పొడిచింది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సహచరులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అధికారికంగా జన్మభూమి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మరోవైపు ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి లేకుండా అధికారులను బదిలీ చేయరాదన్న నిబంధనకూ ప్రభుత్వం పాతరేసింది.
స్థానిక సంస్థల కోటా కింద 12 శాసనమండలి స్థానాలకు ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించడం తెలిసిందే. కానీ సీఎంతోపాటు మంత్రులందరూ బుధవారం అధికారికంగా జన్మభూమి నిర్వహించారు. మరోవైపు ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక ఈసీ ముందస్తు అనుమతి లేకుండా అధికారుల్ని కదల్చరాదన్న నిబంధనకూ రాష్ట్రప్రభుత్వం పాతరేసి కొంత మంది అధికారులను బదిలీ చేసింది.