ఆనందపురం(భీమిలి): సభ్య సమాజం తలదించుకునేలా వావి వరసలు మరిచి స్వయాన తన అక్క కొడుకుతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం బయట పడి భర్త నిలదీయడంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. అందుకు తన ప్రియుడినే పురమాయించింది. ఆ వ్యక్తి స్వయాన తన తమ్ముడినే వెంటేసుకొని వెళ్లి బాబాయ్‌ని అంతమొందించాడు. మండలంలోని గొట్టిపల్లిలో జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించి ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరరావు, ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పద్మనాభం మండలం, కురపల్లి గ్రామానికి చెందిన నరసియ్యమ్మకు విజయనగరం జిల్లా, డెంకాడ మండలం, మోదవలస గ్రామానికి చెందిన బాడితబోయిన రాములప్పడుతో పదేళ్ల క్రితం వివాహమైంది.
వారికి ఇద్దరు పిల్లలున్నారు. నరసియ్యమ్మ అక్క రమణమ్మ ఆనందపురం మండలంలోని గొట్టిపల్లిలో ఉంటోంది. అక్క చెల్లెళ్లు పరస్పరం రాకపోకలు సాగిస్తుంటారు. రాములప్పడు కూలి పనికోసం లక్కవరపుకోట తదితర ప్రాంతాల్లో బ్రిక్ ఇండస్ట్రీస్‌కి వెళ్లి 15 రోజులకోసారి ఇంటికి వస్తుంటాడు. కుటుంబం మోదవలసలోనే ఉంటోంది. గొట్టిపల్లిలో ఉంటున్న నరసియ్యమ్మ అక్క రమణమ్మ కొడుకు అప్పలరాజు(21) తరుచూ మోదవలస రాకపోకలు సాగించడాన్ని రాములప్పడు కుటుంబ సభ్యులు గమనించారు. ఈ విషయాన్ని రాములప్పడుకు తెలియజేయగా అతను అప్పలరాజుపై నిఘా ఉంచి వాస్తవమేనని రూఢీ చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తలు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
రాములప్పడు గట్టిగా నిలదీయడంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నరసియ్యమ్మ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉదయం గొట్టిపల్లిలో ఉన్న తన అక్క రమణమ్మ ఇంటికి వచ్చేసి తన భర్త వేధిస్తున్న విషయాన్ని అప్పలరాజుకు తెలపడంతో రాములప్పడును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నరసియ్యమ్మ గొట్టిపల్లి వచ్చిన విషయం లక్కవరపుకోటలో పనిలో ఉన్న రాములప్పడుకు తెలియడంతో అదే రోజు మధ్యాహ్నానికి అతను గొట్టిపల్లి చేరుకున్నాడు. అప్పటికే పక్కా వ్యూహంతో ఉన్న అప్పలరాజు తన తమ్ముడైన ఎల్లారావు (19)ని వెంట బెట్టుకొని రాములప్పడుతో కలిసి చందకలో మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు. అనంతరం గొట్టిపల్లి గ్రామ సమీపంలో ఉన్న మామిడితోటలోకి తీసుకెళ్లి రాములప్పడుకు పూర్తిగా మద్యం పట్టారు.
మత్తులోకి జారుకున్నాక ముందు అప్పలరాజు రాములప్పడుని కర్రతో కొట్టగా ఎల్లారావు నోటిని అడిచిపెట్టి ఛాతీపై కర్రతోను చేతులతోను విచక్షణారహితంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వారిరువురు గ్రామంలోకి వచ్చి ఆ విషయాన్ని నరసియ్యమ్మకు తెలపగా సంఘటనా ప్రాంతం వద్దకు ఆటోలో వెళ్లి స్పృహ తప్పి ఉన్న రాములప్పడును ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఒక ఇంట్లో ఉంచారు. మద్యం ఎక్కువైందని అందరినీ నమ్మించారు. చీకటిపడగానే గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించడంతో అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. దీంతో రాములప్పడుని అదే ఆటోపై నరసియ్యమ్మ మోదవలసలోని తన ఇంటికి తీసుకొని వెళ్లి గుట్టుగా ఇంట్లో పడుకోబెట్టి, వారు జారుకోవడంతో రాములప్పడు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరావు ఆదేశాలతో సీఐ ఆర్.గోవిందరావు, ఎస్‌ఐ ఎన్.గణేష్ రంగంలోకి దిగారు. ముందుగా మోదవలసలో ఉన్న శవాన్ని భీమిలి తరలించారు. అనంతరం గొట్టిపల్లి వెళ్లి విచారణ జరపడంతో అసలు విషయం బయట పడింది. ఈ సంఘటనలో రాములప్పడు భార్య నరసియ్యమ్మ, గండిబోయిన అప్పలరాజు, ఎల్లారావులను నిందితులగా తేల్చి అరెస్ట్ చేశారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment