జెన్‌కోను బలిపశువు చేస్తారా? | Will APGENCO become a scapegoat? | Sakshi
Sakshi News home page

జెన్‌కోను బలిపశువు చేస్తారా?

Published Mon, Sep 2 2013 2:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

Will APGENCO become a scapegoat?

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక భారాన్ని జెన్‌కోపై మోపడం ద్వారా ఆ సంస్థను బలిపశువు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిస్కంల నుంచి తమకు రావాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిలను మాఫీ చేయడం సరికాదని జెన్‌కో వాదిస్తోంది. ఈ మేరకు జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ) డి.ప్రభాకర్‌రావు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సుమారు 8 పేజీల లేఖను ఇటీవల అందజేసినట్టు సమాచారం. విద్యుత్ సరఫరా పొందినందుకుగానూ డిస్కంలు సుమారు రూ.4 వేల కోట్లు డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బకాయిలను మాఫీ చేయాలని జెన్‌కోపై ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్‌కో చైర్మన్ కూడా అయిన మృత్యుంజయ్ సాహు ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవానికి అదనపు విద్యుత్ కొనుగోలు చేసినందుకుగానూ డిస్కంలకు ప్రభుత్వం రూ.6 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది.
 
 ప్రభుత్వం ఈ మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తే... అందులో రూ.4 వేల కోట్లను జెన్‌కోకు డిస్కంలు చెల్లించే అవకాశం ఉంది. కానీ డిస్కంలకు రూ.6 వేల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జెన్‌కో బకాయిలకు ఎగనామం పెట్టే ప్రక్రియకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బకాయిలను మాఫీ చేస్తే జెన్‌కో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి పడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కానీ ఈ విషయంలో సాహు గట్టిపట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అప్పటివరకు 2012-13 ఆర్థిక సంవత్సరపు ఫలితాలను ఆడిట్ నిమిత్తం అకౌంటెంట్ జనరల్ (ఏజీ)కి పంపించవద్దని భీష్మించుకు కూర్చున్నారు.
 
 ఈ సమస్య కారణంగా ఇప్పటివరకు 2012-13 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక ఫలితాలను జెన్‌కో ప్రకటించలేదు. కంపెనీల చట్టం 1956లోని సెక్షన్ 213 (3) ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరునెలల్లోగా ఫలితాలను ప్రకటించాలి. అంటే 2013 ఏప్రిల్‌తో ముగిసిన 2012-13 ఆర్థిక సంవత్సరపు ఫలితాలను సెప్టెంబర్ చివరినాటికి ప్రకటించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ జరగలేదు. సెప్టెంబర్ చివరినాటికి ఆర్థిక ఫలితాలను ఏజీ క్లియర్ చేయకపోతే... రుణాలు పొందేందుకు సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే జెన్‌కో చేపడుతున్న పలు విద్యుత్ ప్లాంట్లకు నిధుల సమీకరణ సమస్యగా మారుతుందని... ఫలితంగా విద్యుత్ ప్లాంట్ల విస్తరణకు బ్రేక్ పడుతుందని జేఎండీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement