
20న ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ ప్రారంభం
అనంతపురం టౌన్ : సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 20న ’చంద్రన్న క్రిస్మస్ కానుక’ పంపిణీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని ఎనికేపాడులోగల చౌక దుకాణం(నంబర్–6)లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.
కోటి 34 లక్షల కార్డుదారులకు ఉచితంగా ఆరు రకాల సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26 వరకు క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పంపిణీ సమయంలో నాణ్యతలేని సరుకులను తిరస్కరించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. చంద్రన్న కానుకల కోసం రూ.460 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు.