సమన్యాయం జరిగే వరకూ దీక్ష: విజయమ్మ
గుంటూరు : ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను పట్టించుకోని ప్రభుత్వాలు నిలబడవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సమన్యాయం చేయాలంటూ గుంటూరులో ఆమె చేపట్టిన సమర దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగానే ఉందని... సమన్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
టీడీపీ ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేసుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని విజయమ్మ అన్నారు. తద్వారా సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదని ఆమె అభిప్రాయపడ్డారు. దొంగ నాటకాలు ఆడేది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. న్యాయం చేయలేకపోతే విభజన చేయకూడదని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.
విడిపోతామనే వాళ్లకు హైదరాబాద్ ఇస్తానంటున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అత్యధిక నిధులు వచ్చేది హైదరాబాద్ నుంచేనని ఆమె అన్నారు. అలాగైతే ప్రజల సంక్షేమ పథకాల మాటేమిటి అని విజయమ్మ ప్రశ్నించారు. ఇతరులను రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముందు వారు రాజీనామా చేసి ఇతరులకు చెప్పాలని ఆమె సూచించారు.