సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శనివారం సచివాలయంలో మంత్రుల బృందం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ఈ భేటీలో ఐఆర్ ఎంత ఇవ్వాలనే అంశంపై ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే మంత్రుల బృందంతో జరిగే చర్చల్లో అవగాహన కుదరకపోతే ఐఆర్ ఆలస్యం అవుతుందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఐఆర్‌పై ఇప్పటికే ఒకసారి (ఈ నెల 7న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా సమావేశం అయ్యారు.
గరిష్టంగా 50% ఐఆర్‌కు డిమాండ్
పీఆర్‌సీ నివేదిక ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 45 శాతం నుంచి 50 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్‌తో చర్చల సందర్భంగా ఏపీఎన్‌జీవోల సంఘం, పీఆర్‌టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్‌లు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం ఇవ్వాలని కోరాయి. టీఎన్జీవోల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు 45 శాతం, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 47 శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారుు. కాగా, ఐఆర్‌పై పీఆర్‌సీ చైర్మన్ నుంచి ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది.
కొత్త పీఆర్‌సీలో ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి చైర్మన్ అభిప్రాయాన్ని కూడా తీసుకోగా, 15 శాతం ఐఆర్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ కూడా ఐఆర్‌పై లెక్కలు వేసింది. ఐదేళ్ల కిందట 22 శాతం ఐఆర్ ఇచ్చినపుడు ఒక్క శాతానికి రూ.124 కోట్లు వెచ్చించాల్సి రాగా ఇప్పుడు ఒక్క శాతం ఐఆర్‌కు రూ.284.46 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 25 శాతం నుంచి 35 శాతం మధ్యలో అవగాహన కుదరవచ్చని భావిస్తున్నా.. 25 శాతానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు నగదు ప్రయోజనం 2013 జూలై 1 నుంచే వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టే అవకాశం ఉంది.