మధ్యంతర..తిరస్కృతి!
పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్‌పై మెలిక
మధ్యంతర భృతి ఇవ్వాలంటూనే..
అనేక షరతులు
చంద్రబాబు బాటలో కిరణ్ సర్కారు
80 వేల మంది ఉద్యోగులకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో అన్నం పెట్టి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే! ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాలు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ గురువారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ సంబంధిత విభాగాలకు పంపిన ఉత్తర్వుల్లో (యూవో నోట్ నం. 29/4/ఏ2/పీసీజే/2014) మార్గదర్శకాల పేరిట ఆచరణ సాధ్యంకాని నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మొండిచెయ్యి చూపిన విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గత తొమ్మిది పీఆర్సీల్లో డీఏ, ఐఆర్ అందుకుంటున్నామని, ఇప్పుడు కూడా ఇవ్వాలంటూ ఐఆర్ రాని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. గతంలో అనుసరించిన విధంగానే అందరికీ ఐఆర్ మంజూరు చేయడానికి వీలుగా ఉత్తర్వులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ అందుకు భిన్నంగా ఉత్తర్వులు వచ్చాయి. అది కూడా జీవో రూపంలో కాకుండా యూవో నోట్‌తో ప్రభుత్వం సరిపెట్టింది. దీనివల్ల సుమారు 80 వేల మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది.
ని‘బంధనాలు’ ఇవీ..
ఐఆర్ మంజూరుకు అనుసరించాల్సిన 8 మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో సూచించారు. 6 మార్గదర్శకాలు గతంలో ఉన్నవే. ఆయా సంస్థల పాలకమండళ్లకు ఐఆర్ మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి మిగతా రెండు నిబంధనలు దోహదపడనున్నాయి.
ప్రతి సంస్థ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలను పరిశీలించి ఐఆర్ ఇవ్వాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకొనే అధికారాన్ని ప్రభుత్వరంగ సంస్థల శాఖకు అప్పగించడం.. ఒక నిబంధన కాగా, ఆర్థిక శాఖ అనుమతి తర్వాతే ఐఆర్ మంజూరు అమలు చేయాలని షరతు విధించడం రెండో నిబంధన.
స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలకు నిర్ణయాధికారం లేకుండా చేయడం ద్వారా ఐఆర్ మంజూరులో తీవ్ర జాప్యం చేయడానికి, నిబంధనల సాకుతో అసలు ఇవ్వకుండా ఉండటానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయని పీఎస్‌యూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తప్పుబట్టారు.
వైఎస్ ఇచ్చారు...
2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొమ్మిదో పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 22 శాతం ఐఆర్ ఇచ్చారు. ఈమేరకు 2008 అక్టోబర్ 15న 303 జీవో జారీ చేశారు. అందులో పేరా-2(హెచ్)లో ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాల ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేయడానికి అవకాశం ఇస్తూ స్పష్టంగా పేర్కొన్నారు.
పీఎస్‌యూ ఉద్యోగులకు పీఆర్సీ వర్తించదంటూ 1999లో చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగొచ్చి తర్వాత మంజూరు చేసింది. ఇప్పుడు బాబు బాటలో కిరణ్ కుమార్‌రెడ్డి కూడా ప్రయాణిస్తున్నారు.