కార్డు రాస్తే చాలు.. కష్టాలు తీరుస్తాం
ఆంధ్రప్రదేశ్ ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ వల్ల ఇబ్బంది ఎదురైతే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి కార్డు ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందిస్తామని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలు గడువులోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించకపోతే, కమిషనే సుమోటోగా తీసుకుని వినియోగదారులకు భారం కాని రీతిలో టారిఫ్‌లు ఖరారు చేయొచ్చని చెప్పారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా గత అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ భవానీ ప్రసాద్ గతంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఈ 3 నెలల వ్యవధిలోనే విద్యుత్ సంస్థల పటిష్టతకు పలు నిర్ణయాలు తీసుకున్న జస్టిస్ భవానీప్రసాద్‌ను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
క్షేత్రస్థాయి కమిటీలు: నాణ్యమైన విద్యుత్ సేవలందించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం కాబట్టి రాష్ట్రస్థాయి సలహా సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇది ఇచ్చే సలహాలు, సూచనలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది.
మీ మీటర్లు మీ ఇష్టం: పంపిణీ సంస్థలిచ్చే మీటర్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ మీటర్లను వినియోగదారులే కొనుక్కునే వెసులుబాటు కల్పించాం. ప్రజలు తమ సమస్యలపై కార్డు రాసి కమిషన్‌ను ఆశ్రయించవచ్చు.
విశిష్ట అధికారాలు: విద్యుత్ నియంత్రణ మండలికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. అవతకవకలేమైనా కమిషన్ దృష్టికి వస్తే సుమోటోగా విచారణకు ఆదేశించవచ్చు. ఈఆర్‌సీ ఆదేశాలను అమలు చేయకపోతే ఒక్కో వివాదానికి రూ.లక్ష వరకు పెనాల్టీ వేసే అధికారం ఉంది. అప్పటికీ తప్పును సరిచేసుకోకుంటే రోజుకు రూ.6 వేల చొప్పున పెనాల్టీ వేయవచ్చు.
చట్టసభలకు జవాబుదారి: ఈఆర్‌సీ ప్రభుత్వానికిచ్చే వార్షిక నివేదికను అసెంబ్లీ, శాసనమండలి ముందుంచుతారు. విద్యుత్ రంగంలో ప్రైవేటు ఉత్పత్తి, పంపిణీ సంస్థలను కమిషన్ నియంత్రించే వీలుంది. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిధిలో నిఘా వ్యవస్థలున్నా.. వీటన్నింటిపైనా దృష్టి పెట్టడం, నియంత్రించడం కమిషన్ బాధ్యత. పంపిణీ సంస్థలు నష్టపోకుండా, వినియోగదారులు కష్టపడకుండా మధ్యేమార్గంగా చార్జీలను రూపొందించడం ఈఆర్‌సీ లక్ష్యం. విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్‌ఆర్)లు గడువులోగా సమర్పించాలి. తరువాత కమిషన్ మరోనెల గడువు ఇస్తుంది. అప్పటికీ నివేదికలివ్వకపోతే సుమోటోగా తీసుకుని అందుబాటులో ఉన్న సమాచారం మేరకే విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తాం.