
తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: మంత్రి వట్టి
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రక్రియను నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందన్న నమ్మకం తమకుందని వట్టి వసంతకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరంలో ఆయన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఆయన సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులకు సూచించారు.
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిద్దామని సీమాంధ్ర ప్రాంతంలోని 159 మంది ఎమ్మెల్యేలకు వట్టి వసంతకుమార్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే పార్లమెంట్‌లో బిల్లు పెట్టే నైతిక హక్కు ఉండదు ఆయన స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే కోర్టుకు వెళ్లే అవకావం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీల కతీతంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేద్దామని సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులకు సూచించారు.
నాతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన మరుక్షణమే తామంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని వట్టి వసంతకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా మేమంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. అధిష్టానం నిర్ణయం కంటే ప్రజల నిర్ణయమే మాకు ముఖ్యం మంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు.