
కేసీఆర్‌తో చర్చించి పరిష్కరిద్దాం: చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
- కేసీఆర్ వ్యవహార శైలిపైనే మంత్రివర్గంలో 2 గంటలు చర్చ
- ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని మంత్రుల వ్యాఖ్య
- టీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని బాబు సూచన
సాక్షి, హైదరాబాద్: వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉందని, ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల తరఫున నిపుణులు లేదా ప్రతినిధులు కూర్చుని చర్చించి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. కేంద్రం కేవలం రిఫరీగా వ్యవహరిస్తుందని చెప్పారు. సోమవారమిక్కడ కేబినెట్ భేటీ అనంతరం సహచర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, కె.అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో ఈ విషయం చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు... అంతకు ముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కూడా తాజా వివాదాలపైనే సుదీర్ఘంగా చర్చించారు.
అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)తో నేరుగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్తు అంశంపై కొంత చర్చించినా... తరవాత చర్చ మొత్తం కేసీఆర్‌పైకే వెళ్లింది. దాదాపు రెండు గంటలకు పైగా దీనిపైనే చర్చించారు. విభజన చట్టంలో 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన అంశాలకు భిన్నంగా కేసీఆర్ తీసుకున్న చర్యల్ని అధికారులు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోని 107 సంస్థలు, విభాగాలపై ఇరు రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉన్నా తెలంగాణ ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కేసీఆర్ ఇలా ప్రవర్తించడం వెనుక సెంటిమెంటును కొనసాగిస్తూ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనే వ్యూహం ఉందని సమావేశం అభిప్రాయపడింది.
దీనిని రాజకీయంగానే ఎదుర్కొనాలని, అవసరమైతే న్యాయ పోరాటం, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా అడ్డుకట్ట వేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కేంద్రం పైనే కాలు దువ్వుతున్నారని, దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కేసీఆర్ ఏకపక్ష పోకడల వల్లే కేంద్రం హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టిందని, ప్రధాన మంత్రిని ఫాసిస్టు అని విమర్శలు చేయడాన్ని కేంద్రంతీవ్రంగానే పరిగణిస్తోందని మంత్రులు అన్నారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే పరిస్థితి వస్తుందని, చివరకు కేంద్రం నేరుగా జోక్యం చేసుకోనే స్థితికి వస్తుందని విశ్లేషించారు. కేసీఆర్ తీరువల్ల తెలంగాణలోని బడుగు బలహీనవర్గాల వారు చాలా నష్టపోతున్నారని, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ వర్గాల ద్వారానే ఆయనకు చెక్ పెట్టొచ్చని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వివరించారు.
వారికి పరోక్షంగానైనా మద్దతు ఇవ్వాలని అన్నారు. కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదల నుంచి ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని మంత్రులు చెప్పారు. కేసీఆర్‌కు గట్టి సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ముప్పేట దాడిచేయాలని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి చెప్పారు.ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కదారి పట్టించడమే కేసీఆర్ ఎత్తుగడని యనమల వివరించారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల్లో కోటి మంది సెటిలర్ల విషయాన్ని వివాదం చేస్తే తక్కిన వారంతా ఆయనవైపు ఉంటారన్న అంచనాలో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రుల అభిప్రాయాలు విన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై మంత్రులు అవగాహనకు రావాలని,ఎప్పటిక ప్పుడు స్పందిస్తూ కేసీఆర్ తీరును ఎండగట్టాలని సూచించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లు, 8వ సెక్షన్‌లో ఉన్న అంశాలను న్యాయ శాఖ కార్యదర్శితో మంత్రులకు చెప్పించారు. చట్టంలో పేర్కొనని సంస్థల విషయాన్ని గవర్నర్‌ద్వారా కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదాలపై కేంద్రానికి మరోసారి లేఖ రాయనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఏపీకి బదిలీ అయిన ముంపు మండలాలు ఏడింటినీ నోటిఫై చేసి, ప్రత్యేకాధికారులను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.
రాజధానిపై మాట్లాడొద్దు: బాబు
రాష్ట్రంలో రాజధాని నగరం ఎక్కడనే అంశంపై మంత్రులెవరూ ప్రకటనలు చేయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మంత్రులు ఎవరిష్టానుసారం వారు మాట్లాడొద్దన్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తుందని, అందువల్ల ఇప్పుడే ఎలాంటి ప్రకటన లు చేసినా వివాదాలకు దారితీస్తుందని చెప్పారు. రాజధానిపై మంత్రి నారాయణ చేస్తున్న ప్రకటనలు ప్రస్తావనకు వచ్చినప్పుడు సీఎం ఈ విషయాన్ని స్పష్టంచేశారు.
పతాకావిష్కరణ బాధ్యతలపై సీనియర్ల అసంతృప్తి
మంత్రివర్గంలోని జూనియర్లకు స్వాతంత్య్ర దినోత్సవంనాడు జెండా వందనం బాధ్యతలను అప్పగించడం వివాదంగా మారింది. కేబినెట్ భేటీకి ముందు ఈ అంశంపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు.