=సముద్రం పాలవుతున్న మూడు నదుల వర్షపు నీరు
=ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే
=నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు
=ఊసేలేని కైగల్ ఎత్తిపోతల పథకం
పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పనులను అధికారులు, పాలకులు గాలికొదిలేశారు. ఫలితంగా ఏటా 150 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీరు తమిళనాడు రాష్ట్రం గుండా బంగాళాఖాతంలో కలసిపోతోంది.
పలమనేరు, న్యూస్‌లైన్: రామసముద్రం మండలంలో పుట్టే కౌండిన్య నది పుంగనూరు, పెద్దపంజాణి, గంగవరం, పలమనేరుల మీదుగా కౌండిన్య అడవి నుంచి తమిళనాడు రాష్ర్టంలోకి పయనిస్తుంది. ఈ నదిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద మూడేళ్ల క్రితం కౌండిన్యా-1 ( వైఎస్‌ఆర్ జలాశయం) ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు తగినన్ని నీళ్లు లేకపోవడంతో దీనికి అనుసంధానంగా 2012 జనవరిలో గంగన శిరస్సు (కౌండిన్య-2) పనులను ప్రారంభించారు. ఈ పనులూ ఆరు నెలల క్రితం ఆగిపోయూరుు. బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద ఎత్తిపోతల పథకానికి కిరణ్ సర్కార్ రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు.
ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే
కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదుల నుంచి వర్షాకాలంలో 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడు గుండా బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం పలమనేరు మండల సరిహద్దులోని గుడియాత్తం సమీపంలో మోర్ధనా ప్రాజెక్టును నిర్మించింది. ఇక్కడి నుంచి వెళ్లే వృథా జలాలు మోర్ధనా ప్రాజెక్టుకు చేరి అక్కడి ప్రాంతవాసుల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇదే పని మన పాలకులు ఎందుకు చేయలేదని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.
నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు
పలమనేరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మూడేళ్ల క్రితం కౌండిన్య నదిపై కాలువపల్లె వద్ద రూ.53 కోట్లతో పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్‌ఆర్ జలాశయం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఎనగిరేరు వద్ద గంగన్న శిరస్సు నదిపై మరో రిజర్వాయర్‌ను నిర్మించే పనులు రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 55 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీటిని జలాశయంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నీటిని పైప్‌లైన్ల ద్వారా వైఎస్‌ఆర్ జలాశయానికి మళ్లించి పట్టణవాసుల దాహార్తిని తీర్చవచ్చు.
అలాగే బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద దుముకురాళ్ల జలపాతం నుంచి వృథాగా వెళ్లేనీటిని ఎత్తిపోతల పథకం ద్వారా బెరైడ్డిపల్లె, పలమనేరు మండలాల్లోని చెరువులకు మళ్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు అంచనాల దశలోనే ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఈ నదుల విషయం మళ్లీ గుర్తుకొచ్చింది. దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు వృథాగా పోతున్న నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.