మాస్టారూ... రావద్దు
- దాడి చేరికను వ్యతిరేకిస్తున్న ‘తమ్ముళ్లు’
- బీజేపీలోనైనా చేరేందుకు సన్నాహాలు
- దాడి వ్యూహంపై గుర్రుగా ఉన్న అనుచరవర్గం
ఓడలు బళ్లు కావడమంటే ఇదేనేమో!. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ పెత్తనం చెలాయించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయ ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. టీడీపీ గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరే ‘ఆయన వద్దంటే వద్దు...ఆయనకు పార్టీ తలుపులు తెరిస్తే సహించేది లేదు’అని టీడీపీ తమ్ముళ్లు కరాఖండీగా చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఉద్దేశపూర్వకంగా ఏమీ తేల్చకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాంతో దాడి పరిస్థితి కక్క లేక మింగలేక అన్నట్లు తయారైంది. టీడీపీలో అవకాశం దక్కకపోతే బీజేపీ తలుపు తట్టాలన్నది ఆయన వ్యూహంగా ఉంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఆకాశంలో పిట్టను చూసి మసాలా నూరినట్టుగా తయారైంది దాడి వీరభద్రరావు పరిస్థితి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన ప్లేటు ఫిరాయించారు. ఆ పార్టీలో చేరేందుకు తయారయ్యారు. టీడీపీలోని పాత పరిచయాలు తిరగదోడుతూ మంతనాలు సాగించారు. బయటపడకపోయినప్పటికీ జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దాడి చకచకా పావులు కదిపారు. వీలైనంత తొందరగా టీడీపీలో చేరితే... జీవీఎంసీ ఎన్నికల నాటికి తన కుమారుడు రత్నాకర్‌కు మార్గం సుగమం చేసుకోవచ్చన్నది ఆయన దూరాలోచన.
మాస్ట్టారు వద్దే... వద్దు
కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. దాడి వ్యూహం తెలిసి టీడీపీ తమ్ముళ్లు కంగారుపడిపోయారు. ఇప్పుడు పార్టీలో పరిస్థితి ప్రశాం తంగా ఉంది. మాస్టార్ని తీసుకువస్తే మళ్లీ వర్గపోరు రాజుకుంటుందని ఆందోళన చెందారు. అటు అనకాపల్లిలో, ఇటు విశాఖ నగరంలోని టీడీపీ నేతలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు.
అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద రావు అయితే పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడి వద్ద తీవ్రస్థాయిలోనే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గణబాబు కూడా దాడిని చేర్చుకోవడానికి ససేమిరా అన్నారు. మంత్రి గంటాతోపాటు అధిష్టానం పెద్దల వద్ద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు కూడా మూకుమ్మడిగా దాడి వీరభద్రరావు చేరికను వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా దాడి చేరికకు పచ్చజెండా ఊపలేదని తెలుస్తోంది. పార్టీకి ఆయన అవసరం కూడా లేదన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కానీ దాడి తీరుపై గుర్రుగా ఉన్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విషయాన్ని నాన్చుతున్నారు. తద్వారా దాడిని తమ చుట్టూ తిప్పించుకుని మరింత నూన్యతకు గురి చేయాలన్నది టీడీపీ ఉద్దేశంగా ఉంది.
కాకపోతే బీజేపీ... : టీడీపీలో పరిస్థితులు సానుకూలంగా లేవని దాడి గుర్తించారు. అందుకే ప్రత్యామ్నాయ అవకాశంగా ఆయన బీజేపీపై కన్నేశారు. పొత్తులో భాగంగా బీజేపీ జీవీఎంసీ మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే ఆ పార్టీలో చేరి తన కుమారుడి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.
ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ టీడీపీలో పునఃప్రవేశానికి మంతనాలు వేగవంతం చేస్తున్నారు. ఈ పరిణామాలను సమీపం నుంచి గమనిస్తున్న ఆయన అనుచరులు మాత్రం తమ నేత తీరును విమర్శిస్తున్నారు. దాడితో కలసి ప్రయాణించి చేతులు కాల్చుకోవడం కంటే ప్రస్తుతానికి ఆయనకు దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నారు.