నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలపై రానున్న మూడు నెలల్లో వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం చేయనున్నట్లు లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు రామలింగాపురంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాలకు పుట్టినిల్లయిన నెల్లూరు నుంచే తమ పోరాటానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.
మద్యం మహమ్మారి, రాజీవ్ యువకిరణాలు పథకం అమలు తీరు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై తమ పోరాటం సాగుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదన్నారు. ప్రజలను మభ్యపెడుతున్న పాలకుల తీరును బట్టబయలు చేస్తామన్నారు. ఉద్యమంలో భాగంగా జనవరి 30న రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్‌ల ఎదుట నిరసన తెలుపుతామన్నారు. అనంతరం నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు తదితర నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పలువురు యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.
భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు
రానున్న ఎన్నికల్లో తాము ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులోని లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం లోక్‌సత్తా ప్రచారం చేసిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ కలిసి పనిచేశామన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరును లోక్‌సత్తా అధ్యక్షుడు దుయ్యబట్టారు.
ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం
Published Wed, Dec 25 2013 3:58 AM | Last Updated on Sat, Mar 9 2019 3:05 PM
Advertisement
Advertisement