
అవగాహనతో అఘాయిత్యాలను అరికడదాం
మహిళా భద్రతా కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య
హైదరాబాద్: ‘మహిళలపై వేధింపులు, అత్యాచారాలను నిరోధించేందుకు ఎన్నో చట్టాలున్నా అకృత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మహిళలు తమకోసమే ఏర్పాటైన చట్టాలపై అవగాహన పెంచుకొంటేనే అఘాయిత్యాలను అరికట్టగలుగుతాం’ అని మహిళా భద్రతా క మిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య అన్నారు.
మహిళా భద్రతా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పట్టణ మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. పూనం మాల కొండయ్య మాట్లాడుతూ.. మెప్మా గ్రూపులతో కమ్యూనిటీ సెంటర్లలో మహిళలకు అవగాహన కల్పిస్తామన్నారు. మహిళల భద్రతకోసం తాము ప్రభుత్వానికి సిఫారసులు చేస్తామన్నారు. భద్రతా కమిటీ సభ్యులైన ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్యర్, సునీల్‌శర్మ, ఐపీఎస్ అధికారులు స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా, మెప్మా ఎండీ అనితా రామచంద్రన్ సమావేశానికి హాజరయ్యారు.