రైతులను ఆదుకుంటాం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే బాపులపాడు, పెదపారుపూడి మండలాల్లో ఆమె మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించారని పేర్కొన్నారు. రైతుల కోసం రూ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెడతామని ప్రటించారని గుర్తుచేశారు.
ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు పంటలు కోల్పోతే ఆదుకునేందుకు, దెబ్బతిన్న పంటలను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఈ నిధి నుంచి ఖర్చుచేస్తామని వివరించారు. జిల్లాలో వ్యవసాయం పైనే అధికశాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు పక్కా ఇళ్ల మంజూరునే పాలకులు విస్మరించారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించేందుకు డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.700లకు పెంచుతామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని తెలిపారు. బాపులపాడు మండలంలోని రేమల్లె, మల్లవల్లి తదితర గ్రామాల్లో పార్టీ బాపులపాడు జెడ్పీటీసీ అభ్యర్థి కైలే జ్ఞానమణి, ఇతర నాయకులతో కలిసి ప్రచారం చేశారు.
పెదపారుపూడి మండలంలోని పెదపారుపూడి, చినపారుపూడి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మూల్పూరి హరీష, గొరిపర్తి శ్రీలక్ష్మితో కలిసి పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.