వీవోఏలపై ఖాకీల ఉక్కుపాదం
మహిళలని కూడా చూడకుండా అరెస్టులు
ఇళ్లకు వెళ్లి.. ఫోన్లలో బెదిరించిన పోలీసులు
ఆదివారం ఉదయం నుంచే అరెస్టుల పర్వం
18 నెలల జీతాల కోసం 2 నెలలుగా సీఎఫ్‌ల సమ్మె
నేడు హైదరాబాద్‌లో మహాధర్నా, అసెంబ్లీ ముట్టడి
దాన్ని విఫలం చేసేందుకు జిల్లాల్లో
అడ్డుకోవాలని సర్కారు ఆదేశాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యమాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మహిళలని కూడా చూడకుండా బెదిరింపులు, అరెస్టులకు పాల్పడుతోంది. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న పోలీసులు ఐకేపీ మహిళల ఇళ్లకు వెళ్లి, ఫోన్లు చేసి బెదిరించి మరీ పోలీస్‌స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. దీనికి కారణమేమిటంటే.. సోమవారం హైదరాబాద్‌లో జరగనున్న ఐకేపీ సీఎఫ్(వీవోఏ)ల రాష్ట్రస్థాయి ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే ఈ అరెస్టులని తెలిసింది. కొన్ని నెలలుగా ప్రభుత్వం చెల్లించాల్సిన వేతన బకాయిల కోసం కొన్నాళ్లుగా వీవోఏలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో సోమవారం ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలినవారు ఆదివారం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచే గ్రామాలు, పట్టణాల్లో మోహరించి వీవోఏలను అదుపులో కి తీసుకోవడం ప్రారంభించారు.
గ్రామాల్లో అయితే వీవోఏల ఇళ్లకు వెళ్లి మ రీ అదుపులోకి తీసుకున్నారు. ఇంటి వద్ద లేనివారికి ఫోను చేసి తక్షణమే పోలీస్ ష్టేషనుకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించారు. స్వచ్ఛందంగా రాకపోతే రాత్రివేళ ఇళ్లకు వచ్చి అరెస్టు చేస్తామ ని హెచ్చరించారు. స్టేషన్‌కు వచ్చిన వారికి అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ ఆరెస్టులు జరిగాయి. కాగా అదుపులోకి తీసుకున్న వారిని మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు విడిచిపెట్టే పరిస్థితి లేదని తెలిసింది. దీంతో ఇళ్లు, పిల్లలను వదిలి మహిళలు పో లీస్ ష్టేషన్లలో పడి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రభుత్వ చర్యలను మ హిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1300 మంది వీవోఏలు 18 నెలల వేతన బకాయిల కోసం అక్డోబర్ 15 నుం చి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వేతనాల కోసం ఉద్యమించిన మహిళల సమస్య పరిష్కరించకపోగా వారిని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
సీఐటీయూ నేతల ఆరెస్టు
ఐకేపీ సీఎఫ్‌లకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను సైతం ఆరెస్టు చేశారు. శ్రీకాకుళంలో సీఐటీయూ కార్యదర్శి దుప్పల గోవిందరావును, రాజాంలో ఆ యూనియన్ నేత రామూర్తినాయుడును ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నేడు పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నా
ఐకేపీ మహిళా ఉద్యోగుల(వీవోఏ) అక్రమ ఆరెస్టులకు నిరసనగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు సీఐటీయే అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గోవిందరావులు తెలిపారు. వివిధ మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటారని చెప్పారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
పీఎన్ కాలనీ: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. ఐకేపీ ఉద్యోగులతోపాటు, తమ యూనియన్ నేతల అరెస్టులను ఆయన ఖండించారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు తమ ఇంటికి వచ్చి తనను అరెస్టు చేశారన్నారు. 18 నెలల నుంచి వీవోఏలకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహ రించడం సరికాదన్నారు. వీవోఏలకు మద్దతుగా ప్రజల సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.