
కారు బోల్తా: మహిళ దుర్మరణం
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై అంకుశాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని చార్‌బౌలీ ప్రాంతంలో నివాసం ఉండే ఎండీ వాజిద్‌అలీ వ్యాపారి. ఆయన తన కుటుంబీకులు, వదిన, అల్లుడితో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి కారులో బయలుదేరాడు.
మార్గంమధ్యలో మండల పరిధిలోని అంకుశాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద వీరి కారు లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనం బోల్తాపడింది. తీవ్ర గాయాలైన వాజీద్ అలీ వదిన అయేషా సిద్దిఖీ(40) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వాజిద్ అలీ, ఆయన కుటుంబీకులు సయ్యద్ సల్మాన్, నజియా, ముంతాసీన్, డ్రైవర్ లక్ష్మణ్‌లకు గాయాలయ్యాయి. అయేషాసిద్దిఖీ మృతదేహానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. క్షతగాత్రులను నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.