
పశ్చిమ గోదావరి జిల్లా / కొయ్యలగూడెం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో శనివారం మధ్యాహ్నం వివాహ రిసెప్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న లారీ మరొక లారీని ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న రెడ్డియ్య బైక్‌ను ఢీకొంది. దీంతో సత్యవతి అదుపు తప్పి లారీ చక్రాల కింద పడింది. రెడ్డియ్య బైక్‌పై నుంచి అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెడ్డియ్యను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఏలూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. రెడ్డియ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment