వదినను హతమార్చిన మరిది | Woman murdered in Anantapur | Sakshi
Sakshi News home page

వదినను హతమార్చిన మరిది

Published Thu, Jan 16 2014 2:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Woman murdered in Anantapur

అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ :  ప్రేమించిన వాడే సర్వస్వమనుకుని కన్నవారికి దూరమైన ఓ యువతి పెళ్లైన నాలుగేళ్లకే అత్తింటి వారి కర్కశత్వానికి బలైపోయింది. ఆమె మృతి సాధారణమేనంటూ కుటుంబ సభ్యులు బంధువులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఈ నెల 13న ‘వివాహిత దారుణ హత్య’ పేరుతో ‘సాక్షి’ అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురంలోని రామ్‌నగర్‌లో నివాసముంటున్న ఇషాక్ చికెన్ కబాబ్ బండి నిర్వహించేవాడు. 2009లో పెద్దలను ఎదిరించి కమలానగర్‌కు చెందిన చందన (24)ను వివాహం చేసుకున్నాడు.
 
 ఈ వివాహాన్ని అవమానంగా భావించిన యువతి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఇంటిని విక్రయించి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కాగా, మరో మతానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడాన్ని ఇషాక్ సోదరుడు నిసారుద్దీన్ అలియాస్ దీనా తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఈ వివాహం కారణంగా తనకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులందరూ చికెన్ దుకాణం వద్ద ఉండగా నిసారుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. ఒంటరిగా టీవీ చూస్తున్న వదినపై కత్తితో దాడి చేసి గొంతులో పొడిచాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో బట్టలు కుక్కి గొంతు నులిమి హత్య చేశాడు.
 
 అనంతరం దుకాణం వద్దకు వెళ్లి తన అన్నతో పాటు, తల్లిదండ్రులకు విషయం చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు రక్తాన్ని తుడిచివేసి, మృతదేహంపైనున్న దుస్తులు మార్చారు. రక్తంతో తడిసిన చీర, ఇతర దుస్తులను ఓ కవర్‌లో ఉంచి 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలోని మురుగు కాలువలో పడేశారు. అనంతరం చందన హఠాత్తుగా చనిపోయిందంటూ స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నించారు. అదే రోజు రాత్రే హడావుడిగా మృతదేహాన్ని అశోక్ నగర్‌లోని శ్మశాన వాటికకు తరలించారు.
 
 వీరి వ్యవహారాన్ని గమనించిన కాటికాపరి మృతికి దారి తీసిన కారణాలపై ఆరా తీయగా, తన తల్లి చనిపోయిందంటూ ఇషాక్ సమాధానమివ్వడంతో అతను పెద్దగా పట్టించుకోలేదు. అంత్యక్రియల అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు, అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి సామగ్రిని మరో చోటికి తరలించడంతో స్థానికుల్లో అనుమానం బలపడింది. దీంతో ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో విషయం ‘న్యూస్‌లైన్’ దృష్టికి రావడంతో ఘటన వెలుగు చూసింది.
 
 పోలీసుల అదుపులో నిందితులు
 సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎస్పీ సెంథిల్ కుమార్ విచారణకు ఆదేశించడంతో డీఎస్పీ నాగరాజ, సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ రెడ్డెప్పలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిసిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చందన చిన్నాన్న నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు నిసారుద్దీన్, భర్త ఇషాక్, వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్యులతోపాటు తహశీల్దార్ లక్ష్మినారాయణ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను గురువారానికి వాయిదా వేసినట్లు సీఐ తెలిపారు. కాగా, చందన మృతితో ఆమె ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement