‘మదపిచ్చి’ మగ మృగాలు..
సామర్లకోట :తమ బిడ్డకు పట్టిన దుర్గతి.. కలలో కూడా మరెవరి బిడ్డకూ రాకూడదని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘పిచ్చితల్లులను’ కూడా మదపిచ్చి తీర్చుకునే పనిముట్లుగా చూసే వారి నీచత్వానికి ఎన్నడు తెరపడుతుందని ఆక్రోశిస్తున్నారు. ఆడదై పుట్టినంత మాత్రాన ఈ లోకంలో అణువణువునా ఆపదలను, అభద్రతనూ ఎదుర్కోవలసిందేనా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక రజకపేటకు చెందిన ముమన కావమ్మ(23) అనే మతిస్థిమితం లేని యువతి శుక్రవారం రైల్వేస్టేషన్ వద్దనున్న జయ డార్మిటరీ బాత్‌రూమ్‌లో ప్రసవవేదనతో మరణించిన విషయం తెలిసిందే. కావమ్మకు చాలా కాలం నుంచి మతిస్థిమితం లేదు. వైద్యులకు చూపినా ఫలితం లేదనడంతో తల్లిదండ్రులైన గంగ, త్రిమూర్తులు చేసేది లేక మిన్నకుండిపోయారు.
కావమ్మ పట్టణంలోనే తిరుగుతూ దుకాణాల్లో చిన్నచిన్న పనులు చేస్తూ వారిచ్చే డబ్బులు తీసుకునేది. మధ్యమధ్య ఇంటికి వస్తుండేది. పిచ్చిదైన తమ బిడ్డ ఎక్కడెక్కడ తిరిగినా అప్పుడప్పుడూ కనిపిస్తే చాలని, పిచ్చితనమే ఓ రకంగా ఆమెకు రక్షణ అని తల్లిదండ్రులు భావించారు. అంతేతప్ప ఆడదైతే చాలు అని.. కాముకతను తీర్చుకోవడానికి సిద్ధమయ్యే పరమ నికృష్టులు ఉంటారని వారు అనుమానించలేదు. ఈ క్రమంలోనే కావమ్మను ఎవరో కామాం ధులు గర్భవతిని చేశారు. ఆ విషయం కూడా ఆమె తల్లిదండ్రులు గమనించలేకపోయారు. ఆమె ఎప్పటిలాగే ఊరు పట్టుకుని తిరిగేది. శుక్రవారం తాను అప్పుడప్పుడూ చిన్నచిన్న పనులు చేసే జయ డార్మిటరీకి వెళ్లింది.
ఆ సమయంలో పురిటినొప్పులు రావడంతో పరిస్థితి విషమించి బాత్‌రూమ్‌లో ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డా తల్లినే అనుసరించి, కన్నుతెరవకుం డానే కన్నుమూసింది. కావమ్మ మృతిపై పోలీసు లు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎప్పుడూ డార్మిట రీకి వచ్చే కావమ్మ పరిస్థితిని అక్కడివారు ప ట్టించుకుని, సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే తమ కుమార్తె ప్రాణం దక్కేదని గంగ,త్రిమూర్తులు రోదిస్తున్నారు. ఆమెను తల్లిని చేసిన ముష్కరుల్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఏదేమై నా.. ప్రభుత్వం మతిస్థిమితం లేని వారి ఆలనాపాలన బాధ్యత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.