మంత్రి ఆనందబాబును నిలదీస్తున్న మహిళలు
కొల్లూరు: వేమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే మహిళలు హంసపాదు పలికారు. గత ఎన్నికల ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిగా నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి శనివారం ఆయన ప్రచారానికి వెళ్లారు. అయితే ఆయన ఊహలకు భిన్నంగా ఆదిలోనే మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిలుమూరులోని ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడగట్టుకుని వచ్చిన అనుచరగణంతో అట్టహాసంగా నక్కా ప్రచారాన్ని ఆరంభించారు. అయితే చెరుకూరి సంపూర్ణ, పీకే రత్నకుమారి, పీకే లక్ష్మిలతోపాటు పలువురు మహిళలు నిలదీసేసరికి బిక్కమొహం వేశారు.
తమకు కేటాయించిన నివేశనా స్థలాలను వేరే వ్యక్తులకు ఎలా ఇచ్చారని మహిళలు నిలదీశారు. దీంతో కోపగించుకున్న మంత్రి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం అనంతవరం గ్రామానికి వెళ్లిన నక్కాకు అక్కడ సైతం ఎదురుదెబ్బ తగిలింది. పారిశుద్ధ్య సమస్యపై అక్కడి మహిళలు నిలదీశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఆనందబాబు ఓ కుటుంబం ఓట్లు బహిరంగంగా కొనుగోలు చేశారు. పింఛన్ పొందుతున్న దివ్యాంగుడి కుటుంబానికి బహిరంగంగా నగదు అందజేసి విమర్శల పాలయ్యారు. అనంతరం అనంతవరంలో చర్చికి రూ.1 లక్ష చెక్కును అందజేసి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment