మద్యం అమ్మితే ఊరుకోం...
- మహిళల ధర్నా, మూసివేత
- ప్రజాసంఘాల మద్దతు
మద్యం అమ్మకాలపై మహిళలు భగ్గుమన్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ప్ల కార్డులు చేతపట్టి ప్రదర్శన చేశారు. దుకాణం మూసే వరకూ ఉద్యమం ఆపేది లేదంటూ బైఠాయించారు.
ఉలవపాడు: నిత్యం మా పిల్లలు ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలి... ఒంటరిగా బస్సు దిగుతారు. మా పిల్లలకు రక్షణ ఉండాలంటే ఇక్కడ మద్యం షాపు ఉండకూడదు... బరితెగించి పెడితే ఊరుకునేది లేదంటూ మహిళలు ధ్వజమెత్తారు. పంచాయితీ తీర్మానం లేకుండా అన్యాయంగా గత మూడు రోజులుగా ఇక్కడ మద్యం షాపు నిర్మించారు. గత మూడు రోజులు నుంచి ఆందోళనలు చేస్తున్నా మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ధర్నాకు దిగారు. ఎంపీపీ చిన్నమ్మి కూడా మద్దతు పలికారు. బస్‌స్టేషన్ నుంచి పీవీరావు విగ్రహం, అంబేద్కర్ బొమ్మ, పాతబస్టాండ్ వరకు ప్ల కార్డులు చేతపట్టి ప్రదర్శన చేశారు.
ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని, అనుమతులు ఇచ్చిన సర్పంచి, కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్.ఐ. రాజేష్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. అనుమతి ఉందా అని దుకాణం నిర్వాహకులను ఎస్‌ఐ అడిగినా చూపించలేకపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నమ్మి , పంచాయతీ వార్డు సభ్యుడు ప్రభావతి, రైతు కూలీ సంఘం నాయకులు ఆర్. మోహన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, సి.ఐ.టి.యు. నాయకులు కుమార్, దళిత నాయకులు, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, వాసవీ వనితా క్లబ్ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
మద్యం దుకాణం ఎదుట రాస్తారోకో
మార్కాపురం టౌన్: పట్టణంలోని వైపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని వార్డు కౌన్సిలర్‌తోపాటు మహిళలు మంగళవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. సమీపంలో చర్చిలు, ప్రైవేటు పాఠశాలలు నివాస గృహాలున్నాయని, ఎత్తివేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. రోడ్డుపై బైఠాయించటంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ ఆదిమూలపు సుశీల, మాజీ కౌన్సిలర్ కొండయ్య, ఆ ప్రాంత మహిళలు పాల్గొన్నారు.