కార్మికుల సమ్మె సఫలం
అరండల్‌పేట (గుంటూరు) : పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు అనే కంటే ప్రభుత్వం బలవంతంగా కార్మికులతో సమ్మెను విరమింప చేశారనడం సమంజసంగా ఉంటుంది. ఆదివారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రులు నారాయణ, అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడులతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం రూ. 8,300కు అదనంగా రూ.2,700 పెంచి మొత్తం రూ. 11వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.
అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు తమకు సంతృప్తిని ఇవ్వలేదని, ఏఐటీయూసీ నాయకులు ఒప్పుకోవడంతోనే సమ్మె విరమించాల్సి వచ్చిందని సీఐటీయూ, ఇతర స్వతంత్య్ర సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 10వ తేదీన సమ్మె ప్రారంభించిన రెండో రోజే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని అప్పుడే రూ. 2వేలు వేతనం పెంచేందుకు ఒప్పుకున్నారని, అప్పుడే కొంచెం బెట్టు చేస్తే రూ. 2,700లకు ఒప్పుకొనేవారని జేఏసీ ప్రధాన కార్యదర్శి వరికల్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయని, దీంతో తాము బయటకు వచ్చామన్నారు. ప్రభుత్వం బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసి సఫలమైందన్నారు. కార్మికులను తొలగిస్తామని, ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని మంత్రులు తేల్చి చెప్పారని, దీంతో కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మౌనం వహించాల్సి వచ్చిందని తెలిపారు.
తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తేనే..
జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 6,400 మంది పారిశుద్ధ్య కార్మికులు, పొరుగు సేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మెబాట పట్టారు. నిరాహారదీక్షలు, కార్పొరేషన్, కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి ఇలా అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయా పట్టణాల్లో చెత్త, చెదారం పేరుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలతో పాటు అన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపింది.
మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తర్వాతే..
ప్రభుత్వం జరిపిన చర్చల్లో పారిశుద్ధ్య కార్మికులతోపాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌గా గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వర్కర్లు, జీతాల పెంపుపై మంత్రి వర్గ ఉపసంఘంలో నిర్ణయించి చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. అది ఎప్పుడు జరుగుతుంది, నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.