* తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకల్లో సీఎం
* స్వార్థమే ఉంటే.. తిరుపతిలో రాజధాని
* కావాలనే విపక్షం చిచ్చు పెడుతోంది
* టీడీపీ ఓడితే ఇడుపులపాయలో రాజధాని పెట్టేవారు
* కడప రౌడీయిజం చేస్తే ఖబడ్దార్
* వైకుంఠ ఏకాదశి రోజున రైతులతో గడపడం అదృష్టం
* నమ్మి భూములిచ్చినవారిని అభివృద్ధి చేస్తా
సాక్షి, గుంటూరు: సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రపంచంలో మేటి రాజధానులను తలదన్నే లా తుళ్లూరులో ప్రజా రాజధాని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా, మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో తనకెలాంటి స్వార్థమూ లేదని, అదే ఉంటే తిరుపతిలో రాజధాని కట్టుకునేవాడినన్నారు. నిస్వార్థంగా అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా రాజధాని నిర్మాణానికి పూనుకుంటే ప్రతిపక్షం పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
ఒకవేళ టీడీపీ ఓడిపోయి ఉంటే రాజధానిని ఇడుపులపాయకు తరలించుకు పోయేవారన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో గురువారం అధికారికంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మేరీ మాత స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్‌చేసి లాంఛనంగా సంబరాలకు శ్రీకారం చుట్టారు. కడప మార్కు రౌడీయిజం చేయాలని చూస్తే ఖబడ్దార్, భయపడేవారెవరూ లేరంటూ హెచ్చరించారు. 2014 మర్చిపోలేని ఎన్నో చేదు అనుభవాలను మనకు మిగిల్చి వెళ్ళిందని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు మనమెన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ ఓట్లు-సీట్లు రాజకీయాలతో హేతుబద్ధత లేకుండా అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చి చూసుకుంటే 15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. ఏం చేయాలో అర్థం కాకపోయినా ధైర్యంగా ప్రజల ముందుకొచ్చినట్లు చెప్పారు. ప్రజల అండతో అదే ఆత్మ విశ్వాసాన్ని 2015లో కొనసాగిస్తానని తెలిపారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...
టీడీపీ ఓడిపోతే ఇడుపులపాయలో రాజధాని
కొంతమందికి ఇక్కడ రాజధాని రావడం ఇష్టం లేదు. అందుకే రాజధానికి ఇంత భూమి ఎందుకంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాంటి వారి పార్టీ కార్యాలయాలకు మాత్రం వేల ఎకరాలు కావాలా? అడవిలో నిర్మిస్తే పోతుంది కదా... అంటూ ఉచిత సలహా ఇచ్చేవారి ఇల్లు మాత్రం విమానాశ్రయానికి దగ్గర్లో ఉండాలా? కొంతమంది బెదిరించి భూముల విలువ పోగొట్టేలా చేస్తున్నారు. కడప రాజకీయాలు ఇక్కడ సాగవు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి.
* ఓ వైపు నూతన సంవత్సరం మరోవైపు వైకుంఠ ఏకాదశి కలసి వచ్చిన ఈ పవిత్ర దినాన అందరూ కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటుంటే... నేను మాత్రం త్యాగమూర్తులైన తుళ్ళూరు వాసులను దర్శించుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. రైతు ధనేకుల రామారావు 50 ఎకరాల పొలం ఇవ్వడంతోపాటు స్వచ్ఛందంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి 50వేలు ఇచ్చారు. ఆయన కుమారుడు ఇక్కడ రాజధాని వార్తతో షిరిడీలో సాయినాధునికి బంగారు కిరీటం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
* రాజధాని ప్రాంతంలో రైతులకు రూ.250 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాం. మీరు నమ్మి నాకు భూమిచ్చారు. మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదే. ఏ జోన్‌లో భూమి పోతే అక్కడే లాటరీ వేసిస్తాం. ఒక రైతుకు నాలుగైదు చోట్ల భూమి ఉంటే కలిపి ఒకే చోట ఇస్తాం. ఐదారుమంది రైతులు కలసి పూలింగ్‌కు భూమిచ్చి ఒకేచోట కావాలంటే ఇస్తాం. భూ సమీకరణలో భాగస్వాములయ్యేవారికి స్టాంపులు, నాలా, మౌలిక వసతుల ఫీజులు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తాం. రాజధాని ప్రాంతంలో 12వేల మందికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తాం.
* దేవాలయాలు, ట్రస్టు భూములకు అన్యాయం జరగకుండా మామూలు రైతులకిచ్చినట్లే డబ్బులిస్తాం. గ్రామ కంఠాలకు పట్టాలిస్తాం. రోడ్ల వెంబడి ఇళ్ళుపోతే ఉచితంగా ఇళ్ళు కట్టిస్తాం. 2014 డిసెంబర్ 8 లోపల ఉన్న వారినే రాజధానివాసులుగా గుర్తిస్తాం. రాజధాని ప్రాంత వాసులకు విద్య, వైద్యం చదువు ఉచితంగా కల్పిస్తాం. ఎన్టీఆర్ క్యాంటిన్లు, వృద్ధాశ్రమాల ద్వారా ఆదుకుంటాం. కూలీలు, కౌలు రైతులకు నైపుణ్యాల శిక్షణ ఇస్తాం. పేదలకు రూ. 25 లక్షల వరకు వడ్డీలేని రుణ సౌకర్యం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది.
* భూ యజమానుల జాబితా బహిరంగంగా ప్రకటిస్తాం. సామాజిక అవసరాల కోసం భూమి కేటాయిస్తాం. గ్రామాల్లో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో హెల్ప్ డెస్క్‌లు పెడుతున్నాం. ప్రస్తుతం మాన్యువల్ పాస్ పుస్తకాలు ఇచ్చి, తర్వాత వాటిని కంప్యూటరీకరణ చేస్తాం. ఇక్కడివారు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు, అధికారులు వారి వద్దకే వస్తారు. ఈ పంట నూర్పిళ్ళు జరిగిన వెంటనే సర్వేకు అనుగుణంగా పంటలు వేయవద్దు. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. జూన్, జూలై లోపు డెరైక్టరేట్లు, కమిషనరేట్లు ఈ ప్రాంతంలో వస్తాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్లు బ్యాన్ చేసే ప్రసక్తే లేదు. ఎవరైనా చవగ్గా భూములు అమ్ముకుంటే నష్టపోతారు.
అధికారులకు ప్రశంసల వెల్లువ
సీఆర్‌డీఎ కమిషనర్ శ్రీకాంత్ డైనమిక్ అధికారి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరు శ్రీధర్, ఆర్డీవో భాస్కర్‌నాయుడు, తుళ్ళూరు తహశీల్దార్ సుధీర్ చాలా చక్కగా పని చేస్తున్నారు. వీరిని ఏరికోరి వేశాం. వీరితో పాటు మంత్రులు పుల్లారావు, నారాయణ, రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమాతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీ గల్లా జయదేవ్ కృషికి అభినందనలు. శ్రీకాంత్, మంత్రి నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. సంక్రాంతిలోపు భూ అంగీకార పత్రాలు ఇస్తే మూడేళ్ళలో సింగపూర్ తరహా రాజధాని నిర్మించి చూపిస్తాను. భవానీ ఐలాండ్‌ను బ్రహ్మాండమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాను.
పూలింగ్‌కు స్వచ్ఛందంగా అంగీకార పత్రాలిచ్చిన రైతులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తుళ్ళూరుకు చెందిన రైతు ధనేకుల రామారావు 50 ఎకరాలు, పోతూరు శ్రీనివాసరావు 50, జమ్మాల మురళి 5, దామినేని శ్రీనివాసరావు 34, గణేష్‌ప్రసాద్ 21 ఎకరాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్వచ్ఛందంగా అందజేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమని సీఎం ప్రశంసించారు.
కార్యక్రమంలో మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, రావెల కిషోర్‌బాబు, శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌తోపాటు జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు ప్రసంగించారు. తొలుత జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో బయల్దేరిన చంద్రబాబును తుళ్ళూరు ప్రజలు మేళతాళాలతో ఘనంగా ఊరేగిస్తూ గ్రామంలోకి స్వాగతం పలికారు.
ప్రపంచస్థాయి ప్రజా రాజధాని నిర్మిస్తా
Published Fri, Jan 2 2015 1:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement