చిన్నజీవని వదిలేస్తే.. చిదిమేస్తుంది..! | World Malaria Prevention Day Special Story | Sakshi
Sakshi News home page

చిన్నజీవని వదిలేస్తే.. చిదిమేస్తుంది..!

Published Thu, Apr 25 2019 10:46 AM | Last Updated on Thu, Apr 25 2019 10:46 AM

World Malaria Prevention Day Special Story - Sakshi

మలేరియా.. ఒకప్పుడు సీజనల్‌ వ్యాధిగా ప్రచారంలో ఉన్న తీవ్ర జరం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్రామాలు సహా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణలోపం, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి సమస్యల కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్‌ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

చిత్తూరు అర్బన్‌ : చూసేందుకు అది చిన్న జీవే. కానీ కుడితే కలిగే నష్టం అపారం. మనిషిని నిలువునా కుంగదీస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలమీదకే తెస్తుంది. అదే మలేరియాకారక దోమ. జిల్లాలో ఈ సమస్య చాపకింద  నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తంగా లేకుంటే చేజేతులా ప్రాణాలపైకి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే ప్రజల్ని చైతన్యం చేయడానికి ఏటా ఏప్రిల్‌ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

దోమల నియంత్రణకు ప్రభుత్వం కోట్లలో నిధులు ఖర్చు చేస్తోంది. వైద్యశాఖ దీన్ని సరిగా ఉపయోగించుకోకపోవడంతో నిధుల వ్యయం తప్ప ఫలితం కనిపించడం లేదు. ఫాగింగ్, దోమల నివారణకు చేపట్టే చర్యల్లో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప ప్రైవేటు ఆసుపత్రి, నర్సింగ్‌ హోమ్‌లలో రోగుల గురించి రికార్డులు అధికారిక లెక్కల్లోకి రావడం లేదు. దీంతో మలేరియా ప్రమాదకరంగా మారుతోంది. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా కారక దోమలను అరికట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవి తరువాత..
ఎండాకాలం పూర్తవుతుండగానే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, చిన్నపాటి తుంపర్ల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతుంటాయి. మలేరియా వ్యాప్తికి ఈ సీజన్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించే ఈ వ్యాధి ఇటీవల పట్టణాలు, నగరాలను సైతం విజృభిస్తోంది. గత ఏడాది జిల్లాలో 44 కేసులు నమోదయినట్లు అధికారిక లెక్కల్లో ఉంటే ఇది 200కు దాటిందనేది వాస్తవం. అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తూతూమంత్రంగా ఉండడం తదితర కారణాలు వ్యాధికి దోహదం చేస్తున్నాయి. అయితే ప్రైవే టు ఆసుపత్రులకు వస్తున్న కేసులు గురించి బయటకు తెలియడం లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులకే లెక్కల కింద చూపుతున్నారు.

జిల్లాలో ఇవే అధికం..
మలేరియాకు కారణమయ్యే ఫ్లాస్మోడియం పరాన్నాజీవి ఆడ ఎనాఫిలస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటలు, పంట కాలువలు, పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చాలా వేగంగా ఎగురుతూ రాత్రి పూట కుడుతాయి. అవి కుట్టినప్పుడు నొప్పి, శరీరంలో దద్దుర్లు కొందరికి రావచ్చు. శరీరంలోకి ప్రవేశించిన ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. మలేరియాలో ఫ్లాస్మోడియం వైవాక్స్‌ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీపీ) అనేవి రెండు దశాలు. మొదటి దశలో కన్నా జిల్లాలో రెండో దశ వల్ల ఎక్కువ మంది మలేరియా బారిన పడుతున్నారు.

వ్యాధి లక్షణాలు ఇలా..
మలేరియా దోమ ఆరోగ్యవంతుల్ని కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
తొలుత జ్వరం, ఒళ్లుæ నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి.. అంత ప్రమాదకరం కాదు. మందులు వేస్తే తగ్గిపోతుంది. రెండో రకమైన ఫ్లాస్మోడియం పాల్సీఫారం మాత్రం ప్రమాదకరమే.
రెండో దశను త్వరగా గుర్తించి చికిత్స అందజేయకపోతే కాలేయం, కిడ్నీలు, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై ప్రభావం చూపి రోగి కోమాలోకి  వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
రోజు విడిచి రోజు జ్వరం తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. చలిజ్వరం, చమటలు పట్టడం, కొన్నిసార్లు వాంతులవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సప్రదించి రక్త పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవాలి.

జాగ్రత్తలు తప్పనిసరి..
సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే.. ముందే జాగ్రత్త పడడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దోమకాటు బారిన పడకుండా చూసుకోవడం ప్రధానం.
బయటకు వెళ్లేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
ఇంటి చుట్టు పక్కల దోమలు పెరగకుండా చూసుకోవాలి. కూలర్లు, కుండీల్లో వారానికోసారి నీరు మారుస్తుండాలి. నీటి పంపులు, ట్యాంకులపైన మూతలు తప్పనిసరి. టైర్లు, కప్పులు, కొబ్బరి చిప్పలు, పాత్రలు వంటివి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవాలి.
సెప్టిక్‌ట్యాంకు నుంచి గాలివెళ్లే పైపులకు మెస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
నిద్రించేటప్పుడు దోమ తెరలు వాడాలి. కిటికీలు, తలుపులకు దోమలు రాకుండా తెరలు అమర్చుకోవాలి.
దోమలు బాగా ఉన్న ప్రాంతంలో జ్వరాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మలేరియా అవునో, కాదో తేల్చుకోవాలి. ఒకవేళ అది కాకపోతే డెంగీ అనే అనుమానుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

ప్రజలు బాధ్యతగా ఉండాలి..
పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం  ప్రజల బాధ్యతే. పంచాయతీలు, మునిసిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నా.. ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను మనమే తీసేయాలి. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండే కొబ్బరి చిప్పలు, టైర్లను తీసేయండి. ప్రతీ శుక్రవారం కావాల్సిన నీళ్లను ఉంచుకుని డ్రై డేను పాటించాలి. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.   – డాక్టర్‌ ఇ. ఉస్సేనమ్మ,జిల్లా మలేరియా అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement