సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు అసమ్మతి సెగ తాకు తోంది. నరసరావుపేట నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని నెరుపుతున్న వ్యవహారాలపై పార్టీ కార్యకర్తలు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారిని విస్మరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని వల్ల పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లానేతలు ఎవరూ ఆసక్తిచూపక పోవడంతో నేరుగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్, సీఎం తనయుడు నారా లోకేష్‌ను కలసి ఇక్కడి పరిస్థితులను వివరించారు. శనివారం విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ ప్రసంగించిన కొద్దిసేపటి అనంతరం వీరంతా ఆయనను కలసి విషయాలను ఏకరువు పెట్టారు. నరసరావుపేటకు చెందిన కొందరు అసమ్మతి నాయకులు కోడెల శివరామకృష్ణ చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ముఖ్య ఫిర్యాదులు ...
పార్టీ మనుగడకోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు పదవుల కేటాయింపులో న్యాయం జరగడం లేదని, ఆయన వైఖరిని వ్యతిరేకించిన కార్యకర్తలు, నాయకులపై వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, ఇతర పనులు చేసే విషయంలోనూ అర్హులకు న్యాయం చేయడం లేదని, పరిస్థితి ఇలానే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకొంటామని కొందరు కార్యకర్తలు లోకేష్‌కు వివరించారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
బాబు వద్ద పంచాయితీ ...
కోడెల శివరామకృష్ణపై ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దీనికి అసమ్మతి నేతలు వారి కుటుంబసభ్యుల సహా వెళ్లనున్నట్టు నియోజకవర్గంలో వినవస్తోంది.
అసమ్మతి నేతలకు తెరవెనుక మద్దతు ...
కోడెల శివరామకృష్ణపై ఫిర్యాదు చేసిన అసమ్మతి నేతలు, కార్యకర్తలకు పార్టీలోని పెద్దలే పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ పెద్దలే అసమ్మతినేతలు, కార్యకర్తలకు విజయవాడలో లోకేష్ అపాయింట్‌మెంట్ ఇప్పించారని, 30వ తేదీన సీఎంతో మాట్లాడే అవకాశాన్నీ కల్పిస్తున్నట్టు పార్టీలో వినపడుతోంది. మొత్తం మీద కోడెల కుమారుడు శివరామకృష్ణ వైఖరి జిల్లా నేతల మధ్య విభేదాల పెరుగుదలకు కారణమవుతోంది. పార్టీ పెద్దలు గ్రూపులు, వర్గాలుగా విడిపోవడానికి మరింత దోహదం చేస్తున్నాయి. పెద్దల మధ్య సంబంధాలు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ సంఘటన ఎటునుంచి ఎటువైపునకు దారి తీస్తుం దోనని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అరాచకాలపై..ఆగ్రహం
Published Mon, Jun 29 2015 2:55 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement