
జనం అవసరాలు గుర్తించి
సంక్షేమ పథకాలతో భరోసానిచ్చి
108, ఆరోగ్యశ్రీలతో ప్రాణం పోసి
ఇందిరమ్మ ఇళ్లతో గూడు కల్పించి
ప్రాజెక్టులతో జల సిరులు పారించి
అన్నదాతల కన్నుల్లో వెలుగై మెరిసి
ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో విద్యనందించి
సింహపురి జనం గుండె చప్పుడై
నిలిచినావు ఓ రాజన్నా..
సింహపురి గడ్డపై చెరగని ముద్ర ఆయనది. పాలనను పరుగు తీయించిన, రాజకీయంగా అనేక మందికి మార్గదర్శకుడిగా, గురువుగా నిలిచిన చరిత్ర ఆయనది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురై అసంపూర్ణంగా, అరకొరగా ఉన్న ప్రాజెక్ట్‌లను గాడిలో పెట్టి సాగునీరు అందించారు. సింహపురి సీమను సస్యశ్యామల ప్రాంతంగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్యలు తీర్చి జిల్లాను ఆంధ్రరాష్ట్రానికి అన్నపూర్ణగా తయారు చేయడం వెనుక ఆయన చేసిన కృషి చరిత్రాత్మకం. కేవలం ఐదేళ్ల పదవీ కాలంలో సింహపురి రూపురేఖలు మార్చారు. రాజకీయంగా ఉద్దండులకు నెలవైన జిల్లాలో అనేక మంది కొత్త వారిని నేతలుగా తీర్చిదిద్ది ప్రజాప్రతినిధులను చేసి చట్టసభల్లో తన పక్కనే వారికి స్థానం కల్పించిన మహనీయ వ్యక్తిత్వం ఆయనది. అందుకే నెల్లూరు జిల్లా ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానం సుస్థిరం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు జిల్లాలో అభివృద్ధి పరుగు తీసిందనేది అందరూ అంగీకరించే బహిరంగ సత్యం. రాష్ట్ర వ్యాప్త కీలక ఘట్టాలకు కూడా జిల్లానే ఆయన వేదికగా మలిచారు. కోట్లాది మంది ప్రాణాలను నిలిపిన ఆరోగ్యశ్రీని ప్రారంభించింది ఈ జిల్లాలోని ఉదయగిరిలోనే. దేశంలోనే అగ్రగామి పోర్టులో ఒకటైన కృష్ణపట్నం పోర్టుకు ఆయనే బీజం వేసి పనులు పరుగు తీయించి ప్రారంభించిన ఘనత కూడా ఆయనదే. జిల్లాలో పుష్కలంగా ఉన్న ల్యాండ్ బ్యాంక్‌ను సద్వినియోగం చేసుకుని సెజ్‌ల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఎన్నో పరిశ్రమల ఏర్పాటుకు ఆయనే బీజాలు వేశారు.
రాజకీయ గురువు ఆయనే
జిల్లాలో అనేక మంది రాజకీయ నేతలకు మార్గదర్శిగా మారి గురువుగా ఉన్న ఖ్యాతి దివంగత మహానేతకే దక్కింది. రాజకీయ ఉద్దండులే జిల్లాలను దశాబ్దాలుగా శాసిస్తున్న తరుణంలో రాజకీయాల్లోకి కొత్తవారిని తీసుకు వచ్చి వారి వెన్నంటే నిలిచి ప్రజాప్రతినిధులుగా తయారు చేసి సరికొత్త రాజకీయలకు నాంది పలికారు. జిల్లాలో కేంద్ర మంత్రులు మొదలుకుని జెడ్పీ చైర్మన్ వరకు అనేక మంది దివంగత వైఎస్సార్ చలవతోనే పదవులు అలంకరించారు.
మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చిన వైనం
నెల్లూరు గ్రేడ్–1 మున్సిపాలిటీ వైఎస్సార్ హయాంలోనే నగరపాలక సంస్థగా అవతరించింది. నూతన భవనం నిర్మాణానికి ఆయనే నిధులు మంజూరు చేశారు. 1884 నుంచి మున్సిపాలిటీ ఉన్న నెల్లూరుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్రమంలో 2004లో ప్రజాప్రతినిధులు అడిగిందే తడవుగా 2004లో కార్పొరేషన్‌గా స్థాయిని పెంచారు. ఈ క్రమంలో ఆయన మరణానంతరం నెల్లూరు కార్పొరేషన్ భవనానికి ఆయన పేరే పెట్టి నేతలు మహానేతపై అభిమానం చాటుకున్నారు.
విద్యార్థుల భవితకు విక్రమ సింహపురి
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పడింది. 2008 జులై 14న కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 28న కొత్తగా వర్సిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించారు. ఆగస్టులో 6 కోర్సులతో నూతనంగా విక్రమ సింహపురి యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ యూనివర్సిటీకి వెంకటాచలం మండలం కాకుటూరులో 83 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీకి రూ.25 కోట్లు నిధులను విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 21న 42 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాకుటూరులో నిర్మించిన నూతన భవనంలో 23 కోర్సులతో యూనివర్సిటీని నిర్వహిస్తున్నారు.
పోర్టు నుంచి సెజ్‌ల వరకు
జిల్లాలో కృష్ణపట్నం పోర్టు మొదలుకుని సెజ్ నిర్మాణం వరకు అన్ని వైఎస్సార్ హయాంలో జరిగినవే. ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయాలన్న తలంపుతో నాటి సీఎం చంద్రబాబు 1996లో ఈ పోర్టును నాట్కో సంస్థకు అప్పగించారు. అయితే చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పోర్టును నవయుగ సంస్థకు అప్పగించి పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకుని ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయించారు. 2008 జూలై 17న నాటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో కలిసి వైఎస్సార్ ఈ పోర్టును ప్రారంభించారు. పోర్టు ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో నెల్లూరు జిల్లాకు కేంద్ర బిందువు అయింది.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో మూడు సెజ్‌లు ఏర్పాటు చేశారు. తడ మండలం మాంబట్టులో ఏర్పాటు చేసిన సెజ్‌లో సుమారు 20 కంపెనీలు దాకా వచ్చాయి. ఇందులో సుమారు 15 వేల మందికి ఉపా«ధి లభిస్తుంది. నాయుడుపేట మండలం మేనకూరులో ఏర్పాటు చేసిన సెజ్‌లో సుమారు 15 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సుమారుగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. నెల్లూరు–చిత్తూరు జిల్లా సరిహద్దులోని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ సెజ్‌లో సుమారు 50 కంపెనీలు వరకు ఏర్పాటు చేశారు.
సంగం, నెల్లూరు బ్యారేజీలు
సోమశిల రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచి జిల్లాలోని రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పెన్నా డెల్లా ఆధునికీకరణ, సంగం, నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థాపన, ప్రధానంగా స్వర్ణముఖి బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. మెట్ట ప్రాంతాలకు పంపింగ్ స్కీం ద్వారా తాగు, సాగునీరు అందించే హైలెవల్ కెనాల్‌కు రూ.1000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది ఆయన హయాంలోనే కావటం విశేషం