వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 16న కదిరి నుంచి నగర, పురపాలక ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 16న కదిరి నుంచి నగర, పురపాలక ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతోపాటు 11 పురపాలక, నగర పంచాయతీల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికలు, సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన విషయం విదితమే. వరుస విజయాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించనుండడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. నగర, పురపాలక, నగర పంచాయతీల్లో ప్రతికూల పరిస్థితులతో టీడీపీ ఎదురీదుతోంది. 1995, 2000, 2005 మున్సిపల్ ఎన్నికల్లో నగర, పురపాలక సంస్థల్లో టీడీపీ ఓడిపోవడమే అందుకు తార్కాణం. ఇప్పుడు రాష్ట్ర విభజనలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన తీరుపై నగర, పురపాలక, నగర పంచాయతీల్లోని ఓటర్లు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రవచించిన రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్రం విడిపోయిందని ఓటర్లు భావిస్తున్నారు.
ఇది టీడీపీని మరింత ఇరకాటంలో పడేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్‌పై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాజీనామా బాట పట్టాయి. దాంతో.. కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న జిల్లాలోనే ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఒక్కరూ సాహసించలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి మున్సిపాల్టీ ప్రజల దాహార్తిని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శాశ్వతంగా తీర్చేలా తాగునీటి పథకాలను చేపట్టారు.
మడకశిర, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, గుత్తి, పామిడి నగర పంచాయతీల్లోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వైఎస్ కృషి చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపారు. ఇది వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 16 నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలోని 12 నగర, పురపాలక, నగర పంచాయతీల్లో పర్యటించనున్నారు.
ఈ ప్రచారంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చేపట్టబోయే సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించనున్నారు.