కంఠంరాజుకొండూరు(దుగ్గిరాల): చంద్రబాబు పాలనలో పేదల బతుకుల్లో చీకటి అలుముకుందని ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కంఠంరాజుకొండూరులో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహా పునఃప్రతిష్టమహోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా హాజరైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి వెంకటరోశయ్యలు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యురాలు యేళ్ల జయలక్ష్మి అధ్యక్షత వహించిన సభలో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ప్రజల సంక్షేమం కంటే పాలకుల సంక్షేమమే ముఖ్యం అన్నట్లుగా టీటీపీ పాలన సాగుతోందని విమర్శించారు. ఏపార్టీకైతే వ్యతిరేకంగా నాడు టీడీపీని స్థాపించారో అలాంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జత కట్డడంతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు.
మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ కాలం రాజన్నను దూరం చేసినా... నేనున్నాను అంటూ జగనన్న మన అందరికి కోసం ముందుకు వచ్చారన్నారు. రాబోయే ఎన్నికలలో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం రావాలన్నా... రైతు రాజు కావాలన్నా జగన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం రైతుల నుండి 33 వేల ఎకరాలు బలవంతంగా సేకరించి ఫలసాయాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రజల్ని, రైతుల్ని మోసగించిన టీడీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, దుగ్గిరాల ఎంపీపీ చల్లపల్లి భారతీదేవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుగ్గిరాల, మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు యడ్ల సాయికృష్ణ, మునగాల మల్లేశ్వరరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుర్రుముక్క వేణుగోపాలస్వామిరెడ్డిజెడ్పీటీసీ మాజీ సభ్యుడు యడ్ల వెంకట్రావ్, తాజా మాజీ సర్పంచ్ షేక్ నూర్జహాన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు పాల్గొన్నారు.తొలుత తెనాలి–విజయవాడ ప్రధాన రహదారి వద్ద నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు ఘనస్వాగతం పలికారు. బైక్ ర్యాలీలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జోహార్ వైఎస్సార్... జై జగన్.. జై ఆర్కే నినాదాలతో హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment